హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో నిర్మితమైన ఏఏఏ సినిమాస్ లాంఛనంగా ప్రారంభమైంది. జూన్ 15న అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్‌ను ప్రారంభించారు. జూన్ 16 ఆదిపురుష్ సినిమాతో మొదటి షో పడనుంది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఏఏఏ సినిమాస్ పేరు మారుమోగిపోతోంది. ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పేరు మీద నిర్మించిన సినిమా హాలు కావటంతో దీనికి దేశ వ్యాప్తంగా పేరొచ్చింది. హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్‌లో నిర్మింపబడ్డ ఈ సినిమా హాలు జూన్ 15న ఘనంగా ప్రారంభం అయింది.
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అల్లు అర్జున్ రిబ్బన్ కత్తిరించి హాల్‌ను ప్రారంభించారు. రేపటినుంచి ప్రేక్షకులు ఏఏఏలో సినిమా చూసే అవకాశం ఉంటుంది. ఏఏఏ సినిమాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావటానికి ఇంకో 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
ఏఏఏ ప్రత్యేకతలు ఏంటంటే.. ఇందులో మొత్తం ఐదు స్క్రీన్‌లు ఉన్నాయి. 1350 సీట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఐదు స్క్రీన్లలో ఓ స్క్రీన్ ఎల్‌ఈడీదీ కావటం.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిది కావటం విశేషం. సినిమాతో పాటు ఈ ఏఏఏలో షాపింగ్ చేసుకోవటానికి మాల్స్ ఉన్నాయి. అంతేకాదు! కుటుంబసభ్యులతో, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయటానికి గేమింగ్ కూడా అందుబాటులో ఉంది.
మరో నెలలో ఏఏఏలో ఓ రెస్టారెంట్ కూడా ఓపెన్ కానుంది. ఒక్కో ప్లోర్‌లో ఒక్కో విధమైన సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇక, 16వ తేదీ ఉదయం ఆదిపురుష్ సినిమాతో ఏఏఏ సినిమాలో మొదటి షో ప్రారంభం అవుతుంది. 8 గంటలకు మొదటి షో పడనుంది. రేపు నాలుగు స్క్రీన్లు మాత్రమే ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.
మిగిలిన ఒక స్క్రీన్ వచ్చే వారం అందుబాటులోకి రానుంది. కాగా, 2021 నవంబర్ నెలలో ఏఏఏకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. అల్లు అర్జున్ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక, ఏఏఏ నిర్మాణం కోసం ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్, అల్లు అరవింద్, మురళీ మోహన్, ఎన్ సదానంద్ గౌడ్ భాగాస్వామ్యులయ్యారు