మెగాస్టార్ చిరంజీవి – విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ స్థానం ప్రత్యేకమైనది. ఈ సినిమా తరువాతే చిరంజీవిని టాలీవుడ్ లో అప్ కమింగ్ స్టార్స్ అందరూ తమ గ్యాంగ్ కు ఆయనే లీడర్ అని పిలుచుకోవడం మొదలయింది. ‘గ్యాంగ్ లీడర్’ ఆరంభం నుంచీ సినిమాకు ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అంతకు ముందు చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’ (1987), ‘యముడికి మొగుడు’ (1988), ‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’ (1989), ‘జగదేకవీరుడు – అతిలోకసుందరి’ (1990) వంటి వరుస సూపర్హిట్స్ దక్కాయి. 1990లో ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ చిత్రం మే 9న జనం ముందు నిలచి, వారి మనసులు దోచుకుంది. ఆ సినిమా విడుదలైన సరిగా సంవత్సరానికి 1991 మే 5న ‘గ్యాంగ్ లీడర్’ విడుదలై వీరంగం చేసింది. ఆ చిత్రం కన్నా మిన్నగా ‘గ్యాంగ్ లీడర్’ జయకేతనం ఎగురవేసింది.
గ్యాంగ్ లీడర్’ చిత్రానికి చిరంజీవి, విజయశాంతి, బప్పిలహిరి సంగీతం ఎస్సెట్స్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా విలన్ పాత్ర ధారి రావు గోపాలరావు నోట “ఎక్కువ… తక్కువ…” అంటూ పోలికలు పోలుస్తూ వెలువడ్డ మాటలు జనాన్ని అలరించాయి. సుందరం మాస్టర్, ఆయన తనయుడు ప్రభుదేవా కంపోజ్ చేసినడాన్సులు అభిమానులను కిర్రెక్కించాయి. ఇందులో అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, ఆనంద్ రాజ్, నారాయణరావు, నిర్మలమ్మ, సుధ, సుమలత, నూతన్ ప్రసాద్, జయలలిత తదితరులు నటించారు.గ్యాంగ్ లీడర్’ చిత్రం 30కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. ఈ సినిమా ప్రదర్శితమైన నాలుగు ప్రధాన కేంద్రాలలో వందరోజుల వేడుకలు నిర్వహించడం అప్పట్లో విశేషం. ఈ చిత్రం రజతోత్సవం కూడా జరుపుకుంది. ఈ సినిమా వంద రోజుల వేడుక రీల్ ను ఇ.వి.వి. సత్యనారాయణ తరువాతి రోజుల్లో తన ‘అప్పుల అప్పారావు’లో ఉపయోగించుకోవడం మరో విశేషం.