మీరు త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఈ ఆర్టికల్ చదివి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇది మీలాంటి సింగిల్స్ కోసమే. భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది. అది ఇప్పటికీ అలానే ఉంది. అబ్బాయిలైతే ఒకప్పుడు 22-23 ఏళ్లకు, అమ్మాయిలైతే 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసేవారు. ఇప్పుడు మాత్రం ‘ఆ.. తొందరేముందిలే చూద్దాం’, ‘చేసుకుందాం’ అని అంటున్నారు. పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్ కు మన దేశంలో కుర్రాళ్లు, అమ్మాయిలు దూరంగా జరుగుతున్నారు. దీంతో పెద్దోళ్లకు లేనిపోని డౌట్స్ వస్తున్నాయి. మరి మ్యారేజ్ అంటే యూత్ ఎందుకు భయపడుతున్నారు?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని ఏం లేదు. ఎందుకంటే అది ఆయా కుటుంబాలు, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాసరే పెళ్లిళ్లు జరిగిపోయేవి. ఇప్పుడు మాత్రం కోట్లకు కోట్లు ఆస్తులు ఉన్నాసరే పెళ్లంటే వెనకడుగు వేస్తున్నారు. దానికి చాలానే కారణాలు కనిపిస్తున్నాయి. వాటిని ఈ స్టోరీలో డిస్కస్ చేయబోతున్నాం. మరి ముఖ్యంగా మనం రోజూ చూసే పలు వార్తలు కూడా పెళ్లిళ్లపై చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి. ఓ దశాబ్దం క్రితం అంటే 2011లో భారత్ లో 17.2 శాతం మంది మాత్రమే పెళ్లికాని వారు ఉన్నారు. అదే 2019కి వచ్చేసరికి 23 శాతానికి పెరిగింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే.. పెళ్లంటే యూత్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని!
ఇక పెళ్లంటే యూత్ భయపడటానికి మరో రీజన్. ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిలు ప్రవర్తిస్తున్న తీరు. అందరూ ఇలాంటి వాళ్లే అని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ కొందరు మాత్రం ప్రియుడి కోసం భర్తని చంపేయడం లేదా చంపించడం చేస్తున్నారు. ఇక కొందరు అబ్బాయిలు.. ప్రేమ ఒప్పుకోలేదని అమ్మాయిల్ని అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. కొన్నిసార్లయితే చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది కలిగేంతలా మితమీరి ప్రవర్తిస్తున్నారు. ఇక 1970ల్లో పురుషుల ఆత్మహత్యల సంఖ్య 17 వేల మాత్రమే.. అది 2020కి వచ్చేసరికి 1,08,000కి పెరిగింది. దీన్నిబట్టి చూసుకుంటే మగాడు.. ఫ్యామిలీ అనే సిస్టమ్ వల్ల పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. చివరకు ఆ చట్రంలో పడి ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడట్లేదు. గతేడాది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మెంట్, ఓ హెల్ప్ లైన్ ప్రారంభిస్తే.. దానికి 70 శాతం మంది పురుషులే ఫోన్లు చేశారు. దీనికి ప్రధాన కారణం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డబ్బు ఇబ్బందులే అని తెలుస్తోంది.
ఎవరైనా సరే పెళ్లి చేసుకుని అంతా బాగున్నంత వరకు బాగానే ఉంటుంది. ఒక్కసారి ఏదైనా గొడవ జరగడం లేటు. అమ్మాయిలు.. పోలీస్ స్టేషన్ లో కేసులు పెడుతున్నారు. మన న్యాయ వ్యవస్థ కూడా మహిళలకే సపోర్ట్ చేస్తుందా అనేలా ఉంది. గతేడాదినే తీసుకోండి.. దేశవ్యాప్తంగా ఏకంగా 13, 534 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. 2020తో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. స్వయంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోనే ఈ డేటాని రిలీజ్ చేసింది. ఇందులో 10 శాతం వరకు నకిలీ కేసులే అని తేలింది. అలానే IPC 498A సెక్షన్ కింద ఓ మహిళ లేదా అమ్మాయి కేసు పెట్టడమే లేటు.. పురుషుడిని తీసుకెళ్లి జైల్లో తోసేస్తారు. తీరా అంతా అయిపోయి కేసు రిజల్ట్ వచ్చాక.. అబ్బాయిది ఏం తప్పు లేదని చాలా సందర్భాల్లో తేలుతోంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. పురుషుడితో పాటు అతడి ఫ్యామిలీ కూడా కోలుకోలేనంత ఘోరమైన స్థితికి వెళ్లిపోతుంది. కొన్నిసార్లు రోడ్డున పడుతోంది. ఇలాంటి వాటిని చూస్తున్న చాలామంది అబ్బాయిలు.. పెళ్లంటేనే వణికిపోతున్నారు.
ఇప్పటివరకు అబ్బాయిల గురించి మాత్రమే చెప్పాం కదా.. ఇప్పుడు అమ్మాయిల విషయానికొద్దాం. చాలామంది అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుతున్నారు. తీరా పెళ్లి చేసుకుంటే వంటింటికే పరిమితం కావాల్సి వస్తుందని ఆలోచనలో పడిపోతున్నారు. ఇక పెళ్లి చేసుకుంటే ఉద్యోగం చేయడం కష్టమని భావిస్తున్నారు. అందుకే సింగిల్ గానే ఉండిపోతాం గానీ పెళ్లికి ససేమిరా అంటున్నారు. దాదాపు 59 శాతం మంది అమ్మాయిలు/ అబ్బాయిలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇష్టం లేకుండానే ఉద్యోగాలు చేస్తున్నారని తేలింది. ఇదే కాకుండా గత దశాబ్ద కాలంలో ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. ఇల్లు కట్టుకోవాలంటే 69 శాతం.. రవాణా, ఎలక్ట్రిసిటీతోపాటు రోజూవారీ ఖర్చులు 50-70 శాతానికి పెరిగిపోయాయి. ఇవన్నీ చూస్తున్న నేటి యువతరం.. పెళ్లి చేసుకుని ఈ తిప్పలు ఎందుకు పడాలిరా బాబోయ్ అని సింగిల్ చింతకాయలుగానే ఉండిపోతున్నారు.
ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు చదువు, ఆరోగ్యం అనే చాలా ఇంపార్టెంట్. గతంతో పోలిస్తే ఇప్పుడు వాటి ఖర్చులు బాగా పెరిగిపోయాయి. మీకు పుట్టే కొడుకు లేదా కూతురుని Lkg నుంచి ఇంటర్ వరకు చదివించాలంటే తక్కువలో తక్కువ రూ.30 లక్షలు ఉండాలి. ఈ మొత్తం భవిష్యత్తులో ఇంకా పెరిగే ఛాన్సుంది తప్పితే అస్సలు తగ్గదు. ఇది గత దశాబ్దంతో పోలిస్తే 10-12 శాతం పెరిగింది. గత పదేళ్ల కాలంలో ఖర్చులు పెరుగుతున్నాయి తప్పించి సేవింగ్స్ అస్సలు పెరగడం లేదు. ఇక వెస్ట్రన్ కల్చర్ మన లైఫ్ లోకి రావడం కూడా యూత్ పెళ్లి చేసుకోకపోవడానికి ప్రధాన కారణం. అందుకే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లు పెరుగుతున్నాయి. అదే టైంలో విడాకుల కేసులు పెరుగుతున్నాయి. ఇలా ఇవన్నీ చూస్తున్న యూత్… పెళ్లంటేనే వెనకడుగు వేస్తున్నారు.
ఇప్పటివరకు యూత్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు చెప్పాం కదా.. ఇప్పుడు సింగిల్ గా ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పుకుందాం. అబ్బాయిలు లేదా అమ్మాయిలు సింగిల్ గా ఉండటం వల్ల ఎవరికీ ఆన్సర్ చెప్పాల్సిన పనిలేదు. ఏం నేర్చుకోవాలన్నా, మనల్ని మనం మార్చుకోవాలన్నా సరే మనకు మనం సర్దిచెప్పుకుంటే సరిపోతుంది. అందుకే పెళ్లి చేసుకోని వారితో పోలిస్తే.. సింగిల్ గా ఉన్నవాళ్లే ఎక్కువగా ఫిట్, యంగ్ ఉంటున్నట్లు తేలింది. పెళ్లి చేసుకున్న మగాళ్లలోనే హర్ట్ ఎటాక్స్ ఎక్కువగా వస్తున్నాయట. సింగిల్ గా ఉండటం వల్ల కెరీర్ లో ఎదుగుల ఉంటోంది. చాలామంది ఇండిపెండెంట్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నట్లు తేలింది. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూపోతే బోలెడు ఉన్నాయి గానీ మేం కొన్ని మాత్రమే చెప్పాం. సరే ఇదంతా పక్కనబెడితే మీలో ఎంతమంది సింగిల్ గా ఉంటున్నారు. ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు? ఒకవేళ చెప్పాలనిపిస్తే మాత్రం కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.