పెళ్లి కోసం వరుడు ఏకంగా 28 కిలోమీటర్లు నడిచి వెళ్లాడు. అతడి కుటుంబీకులు కూడా వధువు ఇంటివరకు ఇలా నడుచుకుంటూనే వెళ్లారు. అసలేం జరిగిందంటే..!
పెళ్లి అనేది జీవితంలో ఎంత ప్రత్యేకమైన ఈవెంట్. అలాంటి వేడుకను గ్రాండ్‌గా చేసుకుందామని ప్లాన్ చేసుకుంటారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా వివాహం జరగాలని కలలు కంటారు. అయితే ఇలాంటి వేడుకల్లోనూ కొన్నిసార్లు అనుకోని ఇబ్బందులు, అవాంతరాలు ఏర్పడతాయి. అలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడో పెళ్లి కొడుకు. వివాహం కోసం ఏకంగా 28 కిలోమీటర్లు నడిచాడు పెళ్లి కొడుకు. వధువు ఇంటికి చేరుకునేందుకు పెళ్లి కొడుకుతో పాటు అతడి కుటుంబీకులకూ నడవక తప్పలేదు. డ్రైవర్ల సమ్మె కారణంగా మ్యారేజ్ కోసం వధువు ఇంటికి వెళ్లే వేరు మార్గం లేకపోవడంతో నానా తిప్పలు పడుతూ దాదాపుగా 28 కిలో మీటర్లు నడిచారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కల్యాణ్ సింగ్‌పుర్ బ్లాక్ పరిధిలోని సునాఖండి పంచాయతీలో చోటుచేసుకుంది.
రాయగడ జిల్లా కల్యాణ్ సింగ్‌పుర్ బ్లాక్‌లోని సునాఖండి పంచాయతీకి చెందిన రమేష్ అనే యువకుడికి, దిబలపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహం ఖాయమైంది. శుక్రవారం వధువు ఇంటి దగ్గర వీరి మ్యారేజ్ జరిగింది. ఈ వేడుక కోసం నాలుగు వాహనాలను ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్రంలోని డ్రైవర్లు సమ్మె చేయడంతో వెహికిల్స్‌పై వెళ్లడం వీలు కాలేదు. దీంతో కాలినడకనే పెళ్లికూతురు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. సమ్మె కారణంగా పెళ్లి కొడుకు తరఫున వారంతా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పెళ్లి తర్వాత వరుడి కుటుంబసభ్యులందరూ వధువు ఇంటి దగ్గరే బస చేశారు. ప్రభుత్వం డ్రైవర్ల డిమాండ్లకు సానుకూలంగా స్పందించడంతో సమ్మె ముగిసింది. దీంతో వారి ప్రయాణానికి మార్గం సుగమమైంది.