మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యులు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏందుకంటే ‘మీ ఆరోగ్యం మీ చేతుల్లో’ అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా పరిచయమై గుర్తింపు పొందారు. “ఉప్పు రుచులకు రాజు – రోగాలకు రారాజు” అని.. ఉప్పు, నూనె వాడకం ఆరోగ్యానికి చేటు అని, ఆరోగ్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ప్రసంగాలు చేసిన ఘనత ఈయనదే. ఇలా ఆరోగ్యానికి సంబంధించి అనేక విషయాలు టీవీల ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా అందరికి తెలియజేస్తూ మంచి గుర్తింపు పొందారు. అయితే.. ఇంతవరకు ఎవరికి తెలియని మంతెన సత్యనారాయణ రాజు పూర్తి పేరు చాలా పెద్దగా ఉంది. మరి.. ఆయన పూర్తి పేరు ఏమిటో, ఆయన జీవిత విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మంచి పోషకాహారం, ఆరోగ్య చిట్కాలు మరియు సహజ జీవన విధానాల గురించి నిత్యం ప్రజలకు తెలియజేస్తూ మంతెన సత్యనారాయణ చాలా ఫేమస్ అయ్యారు. ఆయన తెలిపే ఆరోగ్య చిట్కాల, రహస్యల గురించి తెలుసుకునేందుకు వేలాది మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇంత గుర్తింపు పొందిన మంతెన పూర్తి పేరు మాత్రం ఎవరికి తెలియదు. కనీసం ఆయన సొంత ఊర్లో వాళ్లకు కూడా తెలియదు. అయితే ఆయన పూర్తి పేరు “పాండురంగ నాగ నృసింహ వెంకటేశ్ వరప్రసాద్ సత్యనారాయణ”. ఇంత పెద్ద పేరు పెట్టడానికి కూడా బలమైన కారణం ఉందట.
సత్యనారాయణ తాతగారు సమాజ సేవ కోసమే మొత్తం తన జీవితాన్ని ఖర్చు చేశారు. చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రజల మౌలిక అవసరాలు తీర్చడం, వారికి ఆరోగ్య సూచనలు చేయడం, పేదవారికి అండగా నిలవడం ఆయనకి అలవాటు. ఈ పనుల్లో పడి ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఒక్కోసారి నాలుగు నెలలు, ఆరు నెలలు ఆయన ఈ సేవా కార్యక్రమాల్లోనే మునిగిపోయి, ఇంటికి కూడా వచ్చేవారు కాదు. అలా 30 సంవత్సరాలు పాటు ఆయన జీవితాన్ని ప్రజల కోసమే ఉపయోగించారు. ఇక ఎన్ని జబ్బులు వచ్చినా.. ఆయన హాస్పిటల్ కి కూడా వెళ్లేవారు కాదు. కానీ.., క్యాన్సర్ వచ్చి, అది ముదిరిన తరువాత ఆయన హాస్పిటల్ లో అడుగు పెట్టాల్సి వచ్చింది. కానీ.., హాస్పిటల్ కి వెళ్లిన మూడు రోజులకే ఆయన మరణించారు. ఇలా తన తాతగారి గొప్పతనం గురించి, ఆయన మరణం గురించి మంతెన సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
ఇంకా మంతెన సత్యనారాయణ మాట్లాడుతూ.. “ఇలా తాతయ్య మరణం మా నాన్నగారిని చాలా బాధ పెట్టింది. చనిపోయిన తాతయ్య.. తన సంతానంగా మళ్ళీ పుట్టాలని నాన్న చాలా మంది దేవుళ్లను మొక్కుకున్నారు. తరువాత కొన్నాళ్ళకి నేను పుట్టాను. దీంతో.. తాతగారి పేరు కలసి వచ్చేలా నాకు “పాండురంగ నాగ నృసింహ వెంకటేశ్ వరప్రసాద్ సత్యనారాయణ” అని నామకరణం చేశారు. ఆ పేరు కాస్త ఈనాటికి “మంతెన సత్యనారాయణ రాజు” గా స్థిరపడింది అని ఆయన చెప్పుకొచ్చారు.