కాలం ఎంతో వేగంగా మారుతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత పరిస్థితుల్లో పెను మార్పులే వచ్చాయి. ఉద్యోగ రంగంలో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఉన్న ఉద్యోగాల్లో చాలా రకాలు ఇప్పుడు లేవనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇప్పుడున్న ఉద్యోగాల్లో కొన్ని భవిష్యత్తులో ఉండకపోవచ్చు. రాబోయే కాలంలో ఎలాంటి కొలువులు ఉంటాయనే ఆలోచన, అవగాహన విద్యార్థులతోపాటు ఉద్యోగార్థులకు ఉండటం తప్పనిసరి. అప్పుడే జాబ్ మార్కెట్ కు తగినట్లు తమను తాము తయారు చేసుకుని సంసిద్ధంగా ఉండగలరు. కొత్త ఏడాది నేపథ్యంలో.. ఇటీవల దీనిపై కొన్ని అంచనాలు, నివేదికలు రిలీజయ్యాయి. మరి, సమీప భవిష్యత్తులో ఎలాంటి కొత్త ఉద్యోగాలు రూపొందనున్నాయో తెలుసుకుందాం..
ఈ ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియాను అందరూ ఓ రేంజ్ లో వినియోగిస్తున్నారు. అందుకు తగ్గట్లే గత పదేళ్లలో డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, ఇన్ ఫ్లుయెన్సర్ లు బాగా పెరిగారు. ఇప్పటి యువత కంటెంట్ క్రియేటింగ్ వైపు దృష్టి సారిస్తున్నారు. స్థిరాదాయం ఉండటంతో ఈ కెరీర్ దిశగా ఎక్కువ మంది ఉద్యోగార్థులు అడుగులేస్తున్నారు. కంటెంట్ క్రియేటర్లకు అడ్వైజరీ సంస్థలుగా ఇప్పటికే కొన్ని సంస్థలు వెలిశాయి. 8 మంది వ్యక్తులు ఓ క్రియేటర్ టీమ్ గా ఏర్పడి పని చేస్తున్నారు. క్రియేటర్ల పనితీరును గమనించడంతోపాటు వారు కనిపించే తీరు, మాట్లాడే విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వడం, ఆడియెన్స్, నెటిజన్స్ తో దగ్గరగా ఉండేలా చూడటం, ఎప్పటికప్పుడు రీచ్ ను బాగా పెంచుకోవడం ఇలా వారి సేవలు ఉంటాయి. క్రియేటర్ల సంఖ్య పెరిగేకొద్దీ పీఆర్ టీమ్, ఇతర స్టాఫ్ అవసరం కూడా పెరుగుతుంది. అందువల్ల ఫ్యూచర్ లో ఈ జాబ్స్ పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాబోయే రోజుల్లో ఒంటరితనం పెద్ద సమస్యగా మారబోతోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నం కానుందని చెబుతున్నారు. చిన్న కుటుంబాలు పెరగడం, పిల్లలు ఉద్యోగాల కోసం దూరంగా ఉండాల్సి రావడం.. ఇలా అనేక కారణాల వల్ల ఒంటరిగా ఉండే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. కానీ ఇకపై వీరికి రోజువారీ సేవలు అందించేందుకు కొత్త ఉద్యోగాలు తయారు కానున్నాయి. వృద్ధులతో వాకింగ్ కు వెళ్లడం, వారితో తరచూ మాట్లాడటం, స్నేహం చేయడం లాంటివన్నీ కెరీర్ చాన్సులుగా మారనున్నాయి. ఇలాంటి జాబ్స్ కు మెట్రో సిటీల్లో అధికంగా డిమాండ్ ఉంటుందని అంచనా.
ఏ బడా సంస్థలోనైనా హెచ్ ఆర్ విభాగం తప్పక ఉండాల్సిందే. అలాంటి ఈ విభాగంలో టాలెంట్ మేనేజర్ల రూపంలో కొత్త జాబ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్ ఆర్ విభాగానికి దీన్ని అనుబంధంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది మరింత సునిశితంగా, విశ్లేషణాత్మకంగానూ చేయాల్సిన విభాగం. ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగుల బలాలు, బలహీనతలను గుర్తించి.. వారిలోని అసలైన ప్రతిభను ప్రోత్సహిస్తూ, మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేయడమే టాలెంట్ మేనేజర్ విధి. ఉద్యోగుల్లోని నైపుణ్యాలను సానబెట్టేలా ఎప్పటికప్పుడు కంపెనీ తరఫున శిక్షణ ఇప్పిస్తూ.. సంస్థ మీద ఉద్యోగులకు ఇష్టం, నమ్మకం పెరిగేలా చేయడం వంటి బాధ్యతలను టాలెంట్ మేనేజర్లు నిర్వహించాలి. ఉద్యోగులను దీర్ఘకాలం నిలబెట్టుకునేందుకు కంపెనీలకు ఇలాంటి టాలెంట్ మేనేజర్ల సేవలు అవసరం కానున్నాయి.
కరోనా పరిస్థితుల తర్వాత అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. ఒకప్పుడు సెలబ్రిటీలకే పరిమితమైన పర్సనల్ ట్రైన్ల సేవలను ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. హెల్తీగా ఉండేందుకు ఎలాంటి పోషకాహారాన్ని తీసుకోవాలి, ఏయే వ్యాయామాలు చేయాలో చెప్పే ట్రైనర్ల సేవలను కోరుకునే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. అందువల్ల ఫిజికల్ థెరపిస్ట్, పర్సనల్ ట్రైనర్/కోచ్, న్యూట్రిషనిస్ట్ లకు భవిష్యత్తులో డిమాండ్ అధికంగా ఉంటుందని అంచనా. అలాగే డేటా సైంటిస్ట్, మెషీన్ లెర్నింగ్ ఎక్స్ పర్ట్, మెడికల్ ప్రొఫెషనల్స్, సాఫ్ట్ వేర్ డెవలపర్స్, బ్లాక్ చెయిన్ డెవలపర్, జర్నలిస్ట్, రీసెర్చ్ అనలిస్ట్ లాంటి ఉద్యోగాలకూ వచ్చే పదేళ్లలో మరింత ఆదరణ ఉంటుందని అంచనా.