సోషల్ మీడియాలో కనిపించే మీమ్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో తెలిసిందే. ఎలాంటి విషయాన్ని అయినా సింపుల్‌గా, నవ్వుకునేలా చెప్పడమే మీమ్స్ స్పెషాలిటీ. అలాంటి మీమ్స్‌ను రూపొందించే వారికి ఓ కంపెనీ శుభవార్త చెప్పింది.
గత దశాబ్ద కాలం నుంచి మొబైల్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ఇంటర్నెట్ విప్లవం వల్ల ప్రతి ఒక్కరి చేతిలోకి ఫోన్ వచ్చేసింది. కాస్త ఖాళీ సమయం దొరికినా అందరూ ఫోన్లకే అతుక్కుపోతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, మిగిలినవారు పెట్టిన పోస్టులను చూస్తూ కాలక్షపం చేస్తుంటారు. ఇక, సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయినవి మీమ్స్. ఎంత సీరియస్ విషయాన్ని అయినా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సున్నితంగా చెబుతూ నవ్వులు పుట్టిస్తాయి మీమ్స్. సినిమాలు, రాజకీయాలు, ఆటలు.. ఇలా ఏ రంగం గురించైనా సరే, వాటిల్లో జరిగే విషయాలను తెలుసుకోవాలంటే మీమ్స్ చూడాల్సిందే. కొన్ని ఫన్నీ మీమ్స్‌ను చూస్తే కడుపు చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. మీమ్స్‌ను తయారు చేసే వారిని మీమర్స్ అని పిలుస్తుంటారు.
సరదా కోసం మీమ్స్ చేసే మీమర్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిందో కంపెనీ. ఇంట్లోనే కూర్చుని, కాలు కదపకుండా లక్షలు సంపాదించే ఛాన్స్ ఇచ్చింది. ఇంట్లో వద్దనుకుంటే ఆఫీసుకు వచ్చి ఐటీ ఉద్యోగులకు సరిసమానమైన భారీ శాలరీ ప్యాకేజీని అందుకునే అవకాశాన్ని ఇస్తోందో సంస్థ. సోషల్ మీడియా వినియోగంతో మీమ్స్ ద్వారా ఏ విషయమైనా త్వరగా అందరికీ చేరుతోంది. దీంతో చాలా కంపెనీలు తమ బ్రాండింగ్ కోసం మీమ్స్‌ను వాడుకుంటున్నాయి. అందుకే కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన స్టాక్ గ్రో అనే కంపెనీ మీమ్స్ తయారు చేసే మీమర్స్‌కు మంచి ఆఫర్ ఇచ్చింది. చీఫ్ మీమ్ ఆఫీసర్‌కు నెలకు రూ.లక్ష జీతం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ఆ కంపెనీ తెలిపింది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ విభాగాల్లో యువత టార్గెట్‌గా మీమ్స్ రూపొందించాలంటూ లింక్డ్ఇన్లో ఓ పోస్ట్ పెట్టింది. ఇంకెందుకు ఆలస్యం.. మీమ్స్ చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అయితే స్టాక్ గ్రోలో ఈ జాబ్‌కు వెంటనే అప్లై చేసుకోండి.