భారతీయులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చంద్ర గ్రహణం మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తోంది. చంద్ర గ్రహణం 6. 30 వరకు ఉండనుంది. దేశంలో 5.32నుంచి 6.18వరకు దాదాపు 45 నిమిషాల పాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉండనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా గ్రహణం సందర్భంలో ఆలయాలన్ని మూతపడతాయి. కానీ, దేశ వ్యాప్తంగా ఉన్న అతి కొన్ని ఆలయాలు మాత్రమే తెరిచి ఉంటాయి. అంతేకాదు! వాటిలో కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయి. అలాంటి ఆలయాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి ఆలయం ఒకటి.
ఈ ఆలయం గ్రహణ సమయంలోనూ తెరిచి ఉంటుంది. ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న వాయులింగేశ్వర స్వామి ఎంతో మహిమాన్వితుడు కాబట్టి గ్రహం సమయంలోనూ భక్తులకు దర్శనమిస్తాడు. ప్రతీ ఏటా జరిగినట్లే.. రాహు కేతు పూజలతో పాటు.. గ్రహణ సమయంలో అర్చకులు రుద్రాభిషేకాలు చేస్తారు. గ్రహణ సమయంలో ఈ ఆలయాన్ని మూయకపోవటానికి ఓ బలమైన కారణం ఉంది. ఆలయంలో కొలువుదీరిన వాయులింగేశ్వరుడిని సూర్యచంద్రాగ్ని లోచనుడిగా పిలుస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడు సూర్య, చంద్రులు, అగ్నిభట్టారడితో పాటు తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచాన్ని కలిగి ఉన్నాడు.
అందువల్లనే ఈ క్షేత్రంపై రాహు, కేతువులు ప్రభావం చూపలేరని పురాణాలు చెబుతున్నాయి. అందుకే.. దేశ విదేశాల నుంచి రాహు, కేతు, సర్పదోషాలు ఉన్న వారు నివారణ పూజల కోసం ఇక్కడికి క్యూ కడతారు. ఇక, హిందువుల నమ్మకాల ప్రకారం గ్రహణ సమయంలోని సూత కాలంలో ఏ కొత్త పని మొదలుపెట్టరు. ఇంట్లో ఉండటానికి సుముఖత వ్యక్తం చేస్తారు. పంచాగాలు ప్రకారం చంద్ర గ్రహణ సూతకాలం 9.21 గంటల నుంచి ప్రారంభమై 6.18 వరకు ఉండనుంది. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యం కలిగిన వారికి సూతకాలం మధ్యాహ్నం 2.48నుంచి మొదలై సాయంత్రం 6.18వరకు ఉండనుంది.