MLC Driver Case: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అనంత బాబు అపార్ట్‌మెంట్ వద్ద ఎలాంటి గొడవ జరగలేదని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా తేలింది. సోమవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. అనంత బాబు అపార్ట్‌మెంట్ వద్ద జరిగిన గొడవలో సుబ్రమణ్యం కిందపడి చనిపోయినట్లు వెల్లడించారు. అయితే, సీసీటీవీ ఫొటేజీల్లో ఇందుకు భిన్నంగా ఉంది. అందులో రికార్డైన దాన్ని బట్టి.. అపార్ట్‌మెంట్ వద్ద ఎలాంటి గొడవ జరగలేదు. అనంత బాబు రాత్రి 12గంటలకు భార్యతో కలిసి హడావిడిగా ఇంటికి వచ్చి, మళ్లీ ఒంటిగంటకు తిరిగి వెళ్లిపోయారు. గొడవ జరిగిన ఆనవాళ్లు లేవు. దీనికి తోడు అపార్ట్‌మెంట్ వాచ్‌మ్యాన్ శ్రీను ఆ రోజు ఏం జరిగిందో మీడియాతో వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన సుబ్రమణ్యానికి తాను బాబాయిని అవుతానని చెప్పాడు. పుట్టిన రోజు వేడుకలు అక్కడ జరగలేదని వెల్లడించాడు. ఎస్పీ చెబుతున్నట్లుగా అపార్ట్‌మెంట్ దగ్గర ఎలాంటి గొడవ జరగలేదన్నాడు. సుబ్రమణ్యం ప్రమాదంలో చనిపోయాడని అతడి తండ్రి తనకు చెప్పాడన్నాడు. అదే సమయంలో అనంత బాబు కంగారుగా అక్కడినుంచి వెళ్లిపోయారని చెప్పాడు. ఆయనతో పాటు భార్య కూడా ఉందని తెలిపాడు. సాయంత్రం 4గంటలకు వెళ్లి అర్థరాత్రి 12 గంటలకు తిరిగి వచ్చారన్నాడు. పోలీసులు ఎవరూ తమ దగ్గరకు రాలేదని స్పష్టం చేశాడు.కాగా, సుబ్రమణ్యం గత ఐదేళ్లుగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సుబ్రమణ్యం ఎమ్మెల్సీతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో సుబ్రమణ్యం యాక్సిడెంట్‌కు గురయ్యాడంటూ అతడి సోదరుడికి అనంత బాబు సమాచారం ఇచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున తన కారులోనే సుబ్రమణ్యం మృతదేహాన్ని కాకినాడకు తీసుకువచ్చి, అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. శవాన్ని బయటకు తీయాలంటూ అతడి కుటుంబసభ్యుల్ని అనంత బాబు అరిచారు.
వారు ఏమైందని అడగ్గా సమాధానం చెప్పకుండా వేరే కారులో అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక అప్పటినుంచి తమ కుమారుడ్ని ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేశాడని సుబ్రమణ్యం తల్లిదండ్రులు ఆరోపిస్తూ వచ్చారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత దాన్ని హత్య కేసుగా మార్చారు. ఈ నేపథ్యంలోనే సుబ్రమణ్యం మృతదేహానికి శనివారం పోస్టుమార్టం పూర్తయింది. అతడిది హత్యేనని తేలింది. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న అనంత బాబును పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం కోసమే అరెస్ట్ ఆలస్యం అయిందని తెలిపారు. మరి, డ్రైవర్ హత్య కేసులో ట్విస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : MLC Anantha Babu: నేరం ఒప్పుకున్న వైసీపీ MLC అనంతబాబు! హత్యకి కారణం?