‘ప్రేమ’ అనే రెండు అక్షరాల పదం మనిషిని ఎక్కడి దాకైనా, ఎలాంటి పనైనా చేసేలా ప్రేరేపిస్తుంది. అలా ప్రేమించి పెద్దలను ఎదిరించి కొందరు పెళ్లి చేసుకుంటే, మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కొన్ని సంఘటనల్లో మాత్రం అప్పుడప్పుడు అనుకోని ట్విస్ట్ లు జరుగుతుంటాయి. తాజాగా ఓ ప్రేమ జంట విషయంలో అలాంటి ట్విస్ట్ ఒకటి జరిగింది. ప్రేమించుకున్న ఆ జంట తొమ్మిది నెలల కిందట కనిపించకుండా పోయింది. వారి స్వగ్రామాల సమీపంలో ఇటీవల ఓ మహిళ, పురుషుడి మృతదేహాలు బయటపడ్డాయి. ఆ చనిపోయిన వారు ఆ యువతీ యువకుడేనని వారి కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఇటీవల వారి నుంచి వీడియో కాల్ వచ్చింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తిరపతి జిల్లా శ్రీకాళహస్తి లోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఠాగూర్, లలితల కుమార్తె చంద్రిత, పక్కనే ఉన్న రామాపురం అనే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ప్రేమించుకున్నారు. చంద్రశేఖర్ వాలంటీరుగా తన గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి అప్పటికే పెళ్లై.. ఓ బాబు కూడా ఉన్నాడు. అయినా చంద్రశేఖర్, చంద్రితను ప్రేమించాడు. కొన్నాళ్లపాటు ప్రేమించుకున్న వీరిద్దరి విషయం పెద్దలకు తెలిసింది. ఈ ఏడాది జనవరి 10న వీరు ఇళ్లు వదిలి పారిపోయారు. ఈక్రమంలో ఇరు కుటుంబాల వారు.. వారిద్దరి కోసం గాలించారు. కానీ ఎక్కడ వారి సమాచారం తెలియలేదు. ఈ క్రమంలో ఈ నెల 20న కేవీబీపురం మండలం కోవనూరు సమీపంలో తెలుగు గంగ కాల్వలో బాగా ఉబ్బిన స్థితిలో గుర్తు తెలియని యువతి శవం కనిపించింది.
ఆ శవంపై ఉన్న పుట్టు మచ్చలను బట్టి చందిత్ర తల్లిదండ్రులు.. ఆ మృతదేహం తమ కుమార్తదేనని స్పష్టం చేశారు. తమ బిడ్డను చంద్రశేఖర్ చంపేశాడని, అతడి శిక్షించాలంటూ చందిత్ర కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈక్రమంలో వారికి అండగా పలు పార్టీల నేతలు పోలీస్ స్టేషన్ల వద్ద రెండు రోజులు ధర్నాలు చేశారు. ఇదే సమయంలో ఈనెల 22న ఏర్పేడు మండలం అంజిమేడు సమీపంలో బండమానుకాల్వ వద్ద ఓ యువకుడి మృతదేహం లభించింది. ఈ సారి పోలీసులు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా..వారు చూసేందుకు రాలేదు. చంద్రిత తల్లిదండ్రులను పిలిపించగా, ఆ డెడ్ బాడీ చంద్రశేఖర్ దేనని చెప్పారు. అయితే పోలీసుల మాత్రం అనుమానంతో డీఎన్ఏ పరీక్షలు చేయించాలంటూ రెండు మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అప్పటి నుంచి ఆ రెండు మృతదేహాలు అక్కడే ఉన్నాయి. అందరూ చంద్రిత, చంద్రశేఖర్ చనిపోయారని భావించారు. ఈ క్రమంలో తాజాగా ఆదివారం ఆ ప్రేమ జంట వీడియో కాల్ చేసింది.” మేం బాగున్నాము. త్వరలోనే రామాపురానికి వస్తున్నాం మాపై వస్తున్నవన్నీ పుకార్లే. మేం సంతోషంగా ఉన్నాం” అంటూ చంద్రశేఖర్, చంద్రితలు వీడియో సందేశం పంపారు. దీంతో ఈ విషయంపై పుత్తూరు రూరల్ సీఐ సురేషా్ కుమార్ స్పందించారు. బయటపడిన రెండు శవాలపై తమకు అనుమానం ఉన్నందునే డీఎన్ఏ పరీక్షలకు పంపామని తెలిపారు. ఆ నివేదికలు వస్తే మృతులెవరో అనేది తేలుతుందని చెప్పారు. ప్రస్తుతం స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.