ఈ మధ్యకాలంలో ప్రేమ జంటల మరణాలు తరచూ ఏదో ఒక్కచోట జరుగుతున్నాయి. ప్రేమ విఫలమైందని కొన్ని జంటలు ఆత్మహత్య చేసుకుంటే.. ఇతర కారణాలతో మరికొందరు ప్రేమికులు మరణిస్తున్నారు. అంతేకాక కొన్ని ప్రేమ జంటలు అనుమానస్పదస్థితిలో మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇలా ప్రేమ కోసం, ప్రేమ వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట అనుమానస్పద స్థితిలో మరణించింది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వాళ్లు.. త్వరలో పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇంతలోనే రక్తపు మడుగులో విగత జీవులుగా కనిపించారు. ఈ దారుణమైన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా కుక్కనూరు తాలుకా బలిగేరి గ్రామానికి చెందిన ప్రకాష్(20) అనే యువకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతడు కుక్కనూరు పట్టణంలో ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. అలానే బలిగేరి గ్రామానికి చెందిన సుమ(17) అనే యువతి కుక్కనూరులో పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. రోజూ కాలేజీకి ఆటోలో వెళ్లి వస్తుండేది. అలా రోజూ గ్రామం నుంచి ఆటో, బస్సుల్లో బలిగేరి గ్రామం నుంచి వచ్చే క్రమంలో సుమకు ప్రకాష్ తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత కొంతకాలనికి పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అలా చాలా రోజులు పాటు వీరి మధ్య సాగిన స్నేహం.. ప్రేమకు దారితీసింది. అలా కొన్ని రోజులు ఇంట్లో పెద్దలకు తెలియకుండా ప్రేమించుకున్నారు. తమ ఇద్దరివి వేర్వేరు కులాలు కావడం పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవచ్చనే సందేహం వీరికి కలిగింది.
అయినా ఓ ప్రయత్నంగా తమ ప్రేమను కుటుంబ పెద్దలకు తెలియజేశారు. చదువుకునే వయస్సులో ప్రేమ ఏంటని వారు మందలించారు. అంతేకాక వీరి ప్రేమ వ్యవహారాన్ని గ్రామస్తులు కూడా తప్పు బట్టారు. ఇలా జరుగుతున్న క్రమంలో ఏమైందో ఏమో తెలియదు కానీ.. శనివారం యువతి ఇంట్లో ప్రేమ జంట రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించారు. ఈ ఘటన బయటకి రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుక్కనూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇద్దరి గొంతలు వద్ద చిన్నపాటి గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహాలను కుక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.