అనుమానం పెనుభూతంలా మారి ఓ కుటుంబాన్నే బలి తీసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన శివనాగేశ్వరావు(34), మాధవిలత దంపతులు విశాఖలోని గొల్లలపాలెం కంచుమాంబ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి వివాహమై మూడేళ్లయినా పిల్లలు లేరు. కొన్నేళ్లు బాగానే సాగిన వీరి సంసారంలో అనుమానం అనే చిచ్చురాజుకుంది. భార్య మాధవి పై అనుమానంతో శివనాగేశ్వరరావు నిత్యం గొడవ పడేవాడు.
ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి.. 12గంటల సమయంలో వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన శివనాగేశ్వరరావు ఇనుప డంబెల్ తో మాధవి తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. తీవ్ర భయాందోళనకు గురైన శివనాగేశ్వరరావు అక్కడే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్నేళ్ల సంసార జీవితం క్షణికావేశంలో ముగిసిపోయింది.
దంపతుల జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన పై మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అనుమానంతో నిండు జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్న ఇలాంటి వారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.