వద్దు.. నన్ను పట్టుకోవద్దు.. లేదంటే మిమ్మల్నీ కాలుస్తా అంటూ ఏకంగా పోలీసుల మీదకు కాల్పులు జరిపాడో నేరస్తుడు. ఈ చేదు అనుభవం ఇటీవల రాజస్థాన్లోని భరత్పూర్ పరిధిలోని రూద్వాలా పోలీసులకు ఎదురైంది. నడి రోడ్డుపై చేతిలో గన్ తో పోలీసులకే చుక్కలు చూపించాడీ ఘనుడు. అసలు విషయం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్థానికంగా ఉండే రబ్బే అనే యువకుడు గతంలో అనేక ఆరోపణల్లో నేరస్తుడిగా ముద్రవేసుకున్నాడు.
అయితే ఇటీవల పోలీసులు చెర నుంచి తప్పించుకున్నరబ్బే ఓ బస్టాండ్ సమీపంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే హుటాహుటిన కొంతమంది పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పట్టుకున్నా కూడా మళ్లీ తప్పించుకున్నాడు. చేతిలో గన్ తో పారిపోయిన నిందితుడు రబ్బే కొద్ది సేపు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు.
దీంతో అతనిని పట్టుకునేందుకు సినిమా స్టోరీలా పోలీసులు నడిరోడ్డుపై పరుగులు తీశారు. ఇక నన్ను పట్టుకోవద్దని.. లేదంటే మిమ్మల్ని కాల్చేస్తానంటూ బెదిరించాడు. అన్నట్లుగానే రబ్బే తన వద్దనున్న తుపాకీతో పోలీసుల పైకి పలుమార్లు కాల్పులు జరిపాడు. బెదరని పోలీసులు ఎట్టకేలకు నిందితుడు రబ్బేను పట్టుకుని అతని వద్దనున్న ఓ తుపాకీ, రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ఇటీవల రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయంశమవుతోంది.