వివాహిత శ్వేత మృతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు గురించి సీపీ త్రివిక్రమ్ వర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించింది వివాహిత శ్వేత మృతి కేసు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో మంగళవారం అర్ధరాత్రి శ్వేత శవమై కనిపించిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత బంధువులకు అప్పగించారు. అయితే శ్వేత మరణంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్వేత కేసు విషయంపై సీపీ త్రివిక్రమ్ వర్మ స్పందించారు. ఆమెది ఆత్మహత్యేనని ఆయన స్పష్టం చేశారు. శ్వేత సూసైడ్‌కు గల కారణాలను త్రివిక్రమ్ వర్మ మీడియాకు వెల్లడించారు. శ్వేతపై అత్తింటి వేధింపులు నిజమేనన్నారు సీపీ.
‘శ్వేత మీద అత్తింటి వేధింపులు ఉన్నది నిజమే. ఆమె తల్లి ఎదుటే దంపతులు ఇద్దరూ గొడవపడ్డారు. శ్వేత కనిపించట్లేదని బంధువులు కంప్లయింట్ చేశారు. బీచ్ వద్ద మృతదేహం ఉందని సమాచారం అందింది. శ్వేత భర్తతో పాటు ఆయన ఆడపడుచు భర్త మీద కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శ్వేత పేరు మీద 90 సెంట్ల భూమి ఉంది. శ్వేత పేరుపై ఉన్న ఈ భూమిని తన పేరు మీదకు మార్చాలని భర్త మణికంఠ ఇబ్బంది పెట్టాడు. అత్తామామలు చిన్నచూపు చూడటంతో శ్వేత మనస్తాపానికి గురైంది. వారి వేధింపుల కారణంగా గతంలోనూ శ్వేత సూసైడ్‌కు ప్రయత్నించింది. గృహ, లైంగిక వేధింపుల కింద మేం కేసు నమోదు చేశాం. ఐపీసీ సెక్షన్ 354, 498 (ఏ) కింద కేసు రిజిస్టర్ చేశాం. శ్వేత ఒంటి మీద ఎలాంటి గాయాలు కూడా లేవు. పోస్టుమార్టం మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయించాం’ అని సీపీ త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు.