సైదాబాద్ బాలికను అత్యాచారం, హత్య చేసిన నిందితుడు పరారీలో ఉండగా, అతనిపై ప్రభుత్వం రివార్డు ప్రకటించింది. ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ప్రకటించారు. నిందితుడి ఫొటో, ఆనవాళ్లు, ఇతర వివరాలను విడుదల చేశారు. అతని ఆచూకీ తెలియజేయాలనుకొనేవారు ఈస్ట్‌జోన్ డీసీపీకి 9490616366 లేదా టాస్క్‌ఫోర్స్ డీసీపీకి 9490616627 ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నులపై అంజనీకుమార్ మంగళవారం సమీక్షించారు. నిందితుడిపై రివార్డు ప్రకటన నేపథ్యంలో సైబరాబాద్, రాచకొండ పోలీసులూ రంగంలోకి దిగారు. మొత్తం పది బృందాలు క్షేత్రస్థాయిలో గాలిస్తుండగా మూడు కమిషనరేట్లకు చెందిన ఐటీ సెల్స్ సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. రాజు సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండటంతో ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు అతడి ఫొటోతోపాటు వివరాలను పంపినట్లు సమాచారం.