సాధారణంగా భారీ వర్షాలు పడిన సమయంలో రోడ్లు జలమయం అవుతుంటాయి. అలాంటి సమయంలో కొన్ని రోడ్లు కుంగిపోయి పెద్ద గుంటలుగా ఏర్పడుతుంటాయి. ఇలాంటి రహదారుల్లో ప్రయాణం ప్రాణాలకే ప్రమాదం. ఓ వైపు ఎండలు దంచికొడుతున్నాయి.. జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్‌లో ఆకస్తాత్తుగా రహదారి కుంగిపోయింది. ఇది గమనించిన వాహనదారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని సైదాబాద్ – సంతోశ్‌నగర్ ప్రధాన రహదారిలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ప్రస్తుతం సంతోశ్‌నగర్ నుంచి ఐఎస్‌సదన్ చౌరస్తా వెళ్లే రహదారిపై ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. రోడ్డు మధ్యలో పిల్లర్ల కోసం గుంతలు తీసి వదిలేశారు. ఈ క్రమంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది.
ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు సహాయ చర్యలు చేపట్టి వాహనాలను దారి మళ్లించారు. అటుగా వాహనదారులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.