కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోక్సో కేసు నిందితుడు చిత్రదుర్గ మురుగ మఠాధిపతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి మురుగ మఠంలో భారీ బందోబస్తు మధ్య రాజేంద్ర శివమూర్తి స్వామిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్వామీజీని చిత్రదుర్గ జైలుకి తరలించారు. స్వామీజీకి జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించారు. చిత్రదుర్గలోని మురుగ శ్రీ హాస్టల్ లో చదువుకుంటున్న ఇద్దరు మైనర్ విద్యార్థినులు ఆగస్ట్ 26న మఠాధిపతిపై ఫిర్యాదు చేశారు. బాలికలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదు అందడంతో మైసూరు నజరాబాద్ పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
మఠాధిపతి ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టులో చేసుకున్న దరఖాస్తుపై విచారణ కూడా వాయిదా పడింది. అయితే అంతకు ముందే జడ్జి ముందు బాలికలు వాంగ్మూలం ఇచ్చారు. స్వామీజీపై వ్యతిరేకత పెరగడంతో మఠం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ కేసు విషయంలో పొలిటికల్ పార్టీలు సైతం మౌనం వహించాయి.ఎట్టకేలకు భారీ హైడ్రామా మధ్య స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు. స్వామీజీ అరెస్ట్ తో ఎన్నికల దిశగా సాగుతున్న కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తీసుకోనున్నాయి.