హనీ ట్రాప్.. గుర్తు తెలియని వ్యక్తులను నమ్మించి తమ అందంతో వీడియో కాల్స్, చాటింగ్ పేరుతో కొంత మంది దారుణాలకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వాలని, లేకుంటే నీ వీడియోలు బయటపెడతామని బ్లాక్ మెయిల్ కు దిగుతూ మోసాలకు పాల్పడుతుంటారు. ఈ వ్యవహారం గత కొన్నాళ్ల నుంచి వినిపించలేదని కాస్త సంభరపడే లోపే తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. ఓ నగల వ్యాపారిని మోసం చేసిన ఓ ముఠా సభ్యులు అతని వద్ద నుంచి ఏకంగా రూ. 48 లక్షలు కొల్లగొట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నగరంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన ఓ నగల వ్యాపారి రాత్రి 8 గంటలకు కర్ణాటకలోని మండ్య బస్టాండ్ వద్దకు మంగళూరుకు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. అతని వద్దకు సల్మా బాను, జయంత్ వ్యక్తులు ఉన్న ఓ కారు వచ్చి.. మీరు ఎక్కడికి వెళ్లాలి, మేము మైసూరు వరకు డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకున్నారు. కారులో వెళ్తుండగా అతనితో మాట్లాడుతూ అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతను నగల వ్యాపారి అని తెలుసుకున్న ఈ ముఠా సభ్యులు.., మా వద్ద కొన్ని బంగారం బిస్కెట్స్ ఉన్నాయని, వాటి విలువ చెప్పాలని కోరారు. లేదు లేదు నేను రాలేనని అతను సమాధానమిచ్చాడు. అయినా సరే అందులోని నిందితులు అతడిని బలవంతంగా ఆ కారులోనే మైసూరులోని ఓ హోటల్ కు తీసుకెళ్లారు.
నగల వ్యాపారి వెళ్లగానే ఆ హోటల్ లోకి ఓ అమ్మాయి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ యువతితో ఆ నగల వ్యాపారికి మస్కా కొట్టించే ప్రయత్నం చేశారు. ఆ యువతి ఉండగా మరికొందరు వ్యక్తులు వీడియోలు తీశారు. అనంతరం జయంత్ అనే వ్యక్తి వచ్చి.., మా చెల్లితో నీకేం పని? అంటూ నగల వ్యాపారి మీద దాడికి దిగారు. ఇక అంతటితో ఆగకుండా రూ. 4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరి భయానికి హడలిపోయిన ఆ నగల వ్యాపారి.., అతనికి తెలిసిన ఓ నగల వ్యాపారి, ఒక ఎల్ఐసీ ఉద్యోగి నుంచి సుమారు రూ.48 లక్షల వరకు ఆ ముఠా సభ్యులకు చెల్లించాడు. ఇక రాను రాను మరిన్ని డబ్బులు కూడా పంపాలని వేధించడంతో ఆ వ్యాపారికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఇక చేసేదేం లేక వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.