నమ్మించి మోసం చేసిన భర్త. ప్రియురాలిని మోసం చేసిన ప్రియుడు. భర్త ఇంటి ముందు భార్య ధర్నా. నిన్న మొన్నటి వరకు మనం ఇలాంటి న్యూస్ మాత్రమే విన్నాము. కానీ.., ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది. ఇప్పుడు కొంతమంది మహిళలు.. లేడీ కిలాడీలుగా మారిపోతున్నారు. పేమ, పెళ్లి పేరుతో దగ్గరై అందినంత కాడికి దోచుకుని.., జంప్ అయిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చైనాలో చోటు చేసుకుంది. మంగోలియాలోని బయాన్నూర్ కు చెందిన ఓ వ్యక్తి తన పెళ్లి సంబంధాల కోసం ఓ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించాడు. మ్యారేజ్ బ్యూరో వారు గన్సు అనే ప్రాంతంలో ఓ సంబంధం చూశారు. అమ్మాయి చాలా బాగుంది. కాకపోతే ఆమె పెళ్లి కొడుకుని ఎదురుకట్నం కోరింది. అమ్మాయి అందంగా ఉండటంతో వరుడు ఆమెకి 148,000 యువాన్లు అంటే రూ. 17 లక్షల వరకు సమర్పించుకున్నాడు. దీంతో.., కుటుంబ సభ్యుల ఆధ్వరంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి అయిన మూడు నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ.., ఓరోజు పుట్టింటికి వెళ్లి వస్తానని అతని భార్య తన సొంత ఊరికి బయల్దేరింది. తరువాత నుండి ఆ భార్య భర్తతో కాంటాక్ట్ లో లేకుండా పోయింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్.
ఇదే సమయంలో ఓ రోజు సోషల్ మీడియాల ఆ భర్తకి తన భార్యకి సంబంధించిన కొన్ని వీడియోలు కనిపించాయి.అందులో తన భార్య మరొకరిని వివాహం చేసుకోవడం చూసి షాక్ అయ్యాడు. తాను మోసపోయాను అని తెలుసుకుని పోలీసులను కలుసుకున్నాడు. అయితే.., దర్యాప్తులో పోలీసులకి కూడా దిమ్మ తిరిగిపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ మొత్తం మోసానికి ఆ భార్య పాత్రధారి అయితే.., ఆ మ్యారేజ్ బ్యూరో వారు పాత్రధారులు అని తేలింది. అబ్బాయిలకి అందమైన అమ్మాయిని ఎరగా చూపించడం, పెళ్లికి ముందే ఎదురు కట్నం తీసుకోవడం, తరువాత పత్తాలేకుండా పోవడం వీరి స్టైల్. గ్రామీణ ప్రాంతాల్లో బాగా డబ్బు ఉండి, పెళ్లి కాకుండా మిగిలిపోయిన అబ్బాయిలే వీరి టార్గెట్. ఇక ఇప్పటి వరకు ఆ భార్యకి ఇలా 19 పెళ్లిళ్లు అయ్యాయని, 19 మంది భర్తలను ఈమె మోసం చేసిందని తెలిసి పోలీసులు సైతం షాక్ కి గురి అయ్యారు. ఇలా ఈ ముఠా ఇప్పటి వరకు రూ.2.28కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులైన మ్యారేజ్ బ్యూరో ప్రతినిధి లీ తో పాటు, మరో ఇద్దరు సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక 19 మంది భర్తల.. ఆ ముద్దుల భార్య మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి.. ఇలా మోసాలకు పాల్పడే అమ్మాయిలకి ఎలాంటి శిక్ష వేయాలి? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.