కరోనా వేళ ప్రైవేట్ ఆస్పత్రుల వ్యాపారం అద్బుతంగా సాగుతోంది. కరోనా వచ్చి భయాందోళనలకు గురవుతున్న వారంతా ప్రైవేట్ ఆస్పత్రులకే పరుగెత్తుతున్నారు. దేశం మొత్తం విూద ఇదే పరిస్థితి నెలకొంది. ప్రాణభయంతో డబ్బు ఉన్నా లేకున్నా, అప్పు చేసి లేదా ఉన్న నగలు అమ్ముకుని ఆస్పత్రులకు పరుగెత్తుతున్నారు. చస్తామో బతుకుతామో తెలియని పరిస్థితిలో కరోనా భయంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిఫారసు చేయించుకుని బెడ్డు కోసం నానాయాతన పడుతున్న దృశ్యాలు ఇప్పుడు దేశంలో కోకొల్లలు. కరోనా సోకి దిక్కుతోచక నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితులను ప్రైవేటు ఆసుపత్రులు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయి. ఓ మాదిరి సౌకర్యాలున్న దవాఖానాలో రోజుకు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. మందుల ఖర్చు దీనికి అదనం నామమాత్రపు సౌకర్యాలతో ఉన్న ఓ చిన్న ఆసుపత్రి వసూలు చేసేది రోజుకు రూ.40-రూ.50 వేలు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే ఇది అయిదు నుంచి పది రెట్లు ఎక్కువ. ఇలా అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని 64 ఆసుపత్రులపై 88 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కొన్నింటిపై ఎక్కువ సంఖ్యలోనే ఫిర్యాదులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
వైద్యుడు రోజూ అయిదారుసార్లు వెళ్లి పరిశీలించినట్లు, అన్ని సార్లు పీపీఈ కిట్లు వాడినట్లు, రోగి సామాజిక దూరం పాటించేలా చూసినందుకు రూ.2,500, తడి వ్యర్థాలు పారేసినందుకు రూ.2,500 ఇలా రకరకాల బిల్లులు వేశారు. బీమా కంపెనీలు సైతం ఇలాంటి బిల్లులను తిరస్కరించాయి. దీంతో బీమా ఉన్న రోగులూ అదనంగా రూ. వేల చెల్లించాల్సి వచ్చింది. కొన్ని ఆసుపత్రులు మొదట ఓ బిల్లు వేసి అంతా సెటిల్ అయ్యాక, ఇవి బీమాలో చేరనివంటూ అదనంగా రూ. లక్షల బిల్లులు ఇచ్చినట్లు ఓ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. మందులు కాకుండానే రోజుకు రూ.40వేల నుంచి రూ.లక్షకు పైగా వసూలు చేశారనే ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. కరోనా బాధితుల నుంచి ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల మేరకు మితిమీరినట్లుగా బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ మేరకు 5 ఆస్పత్రుల కొవిడ్ సేవల లైసెన్స్‌ను ఆరోగ్యశాఖ రద్దు చేసింది. బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రితో పాటు బేగంపేటలోని విన్ ఆస్పత్రి, కాచిగూడలోని టీఎక్స్ ఆస్పత్రి, కేపీహెచ్‌బీలోని మ్యాక్స్ హెల్త్, సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రుల కరోనా చికిత్సల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 64 ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీచేసింది.