తన పసుపు కుంకాలు కాపాడు కోవడానికి మహిళలు చేయని పూజలు, వ్రతాలు ఉండవంటే నమ్మండి. తన భర్త పదికాలాల పాటు చల్లగా ఉండాలని మొక్కుకుంటారు. కానీ, ఈమె మాత్రం ఆ కోవకు చెందినది కాదు. పూటుగా తాగి భర్తనే పరలోకానికి పంపిన మహాసాత్వి. ‘ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చింది’ అన్న నానుడి తెలుసుగా ఇక్కడ కూడా అచ్చు అలాంటిదే జరిగింది. అత్త మీదున్న కోపంతో మొగుడ్ని హత్య చేసింది ఈ మహాతల్లి. ఇక్కడ మరో ట్వింస్ట్ కూడా ఉంది. హత్య చేసి అత్త దగ్గరకు వెళ్లి నీ కొడుకుని లేపేశానంటూ చెప్పింది.
ఆగస్టు 23న రాజస్థాన్‌లోని సబ్లా పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అత్తగారికి కోడలు చాలా క్లియర్‌గా చెప్పింది. కానీ, అత్తగారు నమ్మలేదు. నాలుగు రోజుల తర్వాత పక్కింటి వారు బేవా గులాబ్‌కు ఫోన్ చేసి ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని చెప్పారు. అద్దె ఇంటికి వెళ్లి తాళం తీసి చూడగా ఆమె కుమారుడు శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. వెంటనే తలుపులు వేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కోడలే హత్యచేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
భర్త పోయిన కాంతా అనే మహిళను నాథూ వివాహం చేసుకున్నాడు. ఆ వివాహాన్ని బేవా గులాబ్ యాదవ్ అంగీకరించలేదు. తల్లిని ఎదిరించలేకపోయిన నాథూ భార్యను అద్దె ఇంట్లో ఉంచాడు. దానిని అవమానంగా భావించింది కాంతా. అత్త మీద నానాటికి కోపాన్ని పెంచుకుంది. అది ఎలా తీర్చుకోవాలో తెలీక మద్యం తాగడం ప్రారంభించింది. జరిగిన దాన్ని మర్చిపోవడం సంగతి తర్వాత పూర్తిగా మద్యానికి బానిసగా మారిపోయింది. ఒకరోజు పూటుగా మద్యంతాగి ఆ మత్తులో భర్తను హత్య చేసింది కాంతా. అత్త ఫిర్యాదు చేసిందని తెలుసుకుని పరారీలో ఉంది కాంతా. హత్య కేసు నమోదు చేసుకుని పోలీసులు కాంతా కోసం గాలిస్తున్నారు.