సినిమా పిచ్చి ఓ కుటుంబంలో విషాదం నింపింది. సినిమా అవకాశాల కోసం భార్య కుటుంబాన్ని విడిచి వెళ్లటంతో భర్త తట్టుకోలేకపోయాడు. కూతురి పెళ్లికి ఇంటికి వచ్చిన ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని దిండుగల్ జిల్లా, తెన్నామ్‌పాల్యంకు చెందిన అమృతలింగం దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతడి భార్య చిత్ర ఓ బట్టల తయారీ కంపెనీలో పనిచేస్తోంది. వీరిద్దరూ సేలం నగర్‌లో నివాసం ఉంటున్నారు. చిత్రకు నటన అంటే ఎంతో ఇష్టం. అందుకే టిక్‌టాక్‌లో వీడియోలు చేసి పెట్టేది. టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రీల్స్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి.
అయినా ఆమె రీల్స్ చేయటం మానలేదు. ప్రతీ రోజు వీడియోలు చేసి పెట్టేది. దీంతో ఆమె ఇన్‌స్టా ఖాతాలో ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు. తనకు ఇన్‌స్టాలో వస్తున్న ఆదరణ చూసి చిత్ర మురిసిపోయింది. తన ఫాలోవర్స్‌లో చాలా మంది ఆమె నటనను మెచ్చుకున్నారు. సినిమాల్లోకి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. దీంతో ఆమె సినిమాలపై దృష్టి సారించింది. ఎలాగైనా నటి కావాలనుకుంది. భర్తతో గొడవపడి రెండు నెలల క్రితం చెన్నై వెళ్లిపోయింది. గత వారం కూతురి పెళ్లి ఉండటంతో చిత్ర ఊరికి వచ్చింది. భార్య తిరిగిరావటం చూసి అమృతలింగం ఆనందపడ్డాడు. ఇకపై ఇంటినుంచి వెళ్లదులే అనుకున్నాడు.
అయితే, కూతురి పెళ్లి అయిపోయిన తర్వాత చిత్ర చెన్నైకి వెళ్లటానికి సిద్ధమైంది. దీంతో అమృతలింగం ఆగ్రహానికి గురయ్యాడు. భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఈ గొడవకాస్తా హద్దులు దాటింది. లింగం తన భార్యను టవాల్‌తో గొంతు బిగించాడు. దీంతో ఆమె స్ప్రహ తప్పిపడిపోయింది. భార్య నేలకూలడంతో లింగం భయపడిపోయాడు. వెంటనే అక్కడినుంచి పరుగులుపెట్టాడు. ఈ విషయాన్ని ఫోన్‌లో తన కూతురికి చెప్పాడు. అత్తారింట్లో ఉన్న ఆమె హుటాహుటిన పుట్టింటికి వెళ్లింది. అక్కడ చిత్ర విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.