నేటి సమాజంలో వివక్ష బాగా రాటుదేలిపోతోంది. ఆడ, మగ అనే తేడాను ఎత్తిచూపిస్తూ పసిపిల్లలపై తల్లిదండ్రులు కర్కషంగా వ్యవహరిస్తున్నారు. మగ బిడ్డతో తమ వంశాన్ని నిలదొక్కుతుందనే కోరికతో కొందరు తల్లిదండ్రులు పుట్టిన ఆడ పిల్లలను చెత్తలకుప్పలపై పడేస్తున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటనే ఒకటి నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..నగర శివారులోని గొల్లగేరు సమీపంలో ఉన్న ఓ డంపింగ్ యార్డ్ నుంచి పసి పిల్లల కేకలు వినిపించాయి.
ఏంటని స్థానికులు దగ్గరకు వెళ్లి చూస్తే ఆకలి కేకలతో ఆరుస్తున్న ఆడ శిశువు దర్శనమిచ్చింది. దీంతో మానవత స్పూర్తితో స్పందించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన చేరుకున్న పోలీసులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువు జన్మించిందనే ఉద్దేశంతో చెత్త కుప్పలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక తల్లిదండ్రుల ఆచూకి కోసం గాలిస్తూ విచారణ చేపడుతున్నారు. తల్లి పొదలిలో హాయిగా సేదతీరాల్సిన ఈ చిట్టితల్లి ఇలా చెత్త కుప్పలో దర్శనమివ్వటం స్థానికులను ఆవేదనకు గురి చేస్తోంది. ఇలా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.