ఖమ్మం గ్రామీణ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన సాయి చరణ్(28) ఖమ్మంలో చికెన్ వ్యర్థాలు తరలించే వాహన డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఈ యువకుడికి అమ్మా, నాన్న లేకపోవడంతో మేనమామలే పెంచి పెద్ద చేశారు. కొణిజర్ల మండలానికి చెందిన 24 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు సాయి. అయితే ఆమెకు అంతకు ముందే పెళ్ళయ్యింది. మనస్పర్ధలు రావడంతో భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత సాయిని ప్రేమించింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో మొదట్లో యువతి కుటుంబసభ్యులు పెళ్ళికి అంగీకరించలేదు. అయినప్పటికీ ఇద్దరూ పెళ్ళి చేసుకుని కొంతకాలం ఖమ్మం అర్బన్ మండలంలోని వైఎస్‌ఆర్ నగర్‌లో నివాసం ఉన్నారు. రెండేళ్ళ క్రితమే రోటరీనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉన్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి కరుణాకర్ అనే వ్యక్తి వచ్చాడు. సాయితో పాటు పనిచేసే కరుణాకర్‌తో ఆ యువతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది తెలిసిన భర్త పలుమార్లు భార్యతో గొడవ పడ్డాడు. తమ విషయం బయటకు తెలుస్తుందేమోనన్న భయంతో భర్తను మట్టుపెట్టాలని ఫిక్స్ అయ్యింది. ప్రియుడితో కలిసి భర్త మర్డర్‌కు స్కెచ్ వేసింది.
ఆగస్ట్ 1వ తేదీన సాయి, కరుణాకర్, మరో ఇద్దరు పని వాళ్ళు కలిసి చికెన్ వ్యర్థాలు తరలించేందుకు సిద్ధమయ్యారు. ప్రకాష్‌నగర్ బ్రిడ్జి వద్ద సాయి, కరుణాకర్, మరో ఇద్దరు పనోళ్ళు కలిసి మద్యం సేవించారు. అప్పటికే సాయి హత్యకు ప్లాన్ వేసిన కరుణాకర్.. సాయి గొడవ పెట్టుకుంటే హత్య చేయాలని ఫిక్స్ అయ్యాడు. సాయి కూడా తన భార్యతో ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకున్నావని అడుగగా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. గొడవ పెద్దదవ్వడంతో కరుణాకర్, అతని స్నేహితులు కలిసి సాయిని రాడ్‌తో బలంగా కొట్టి చంపారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని మూటగట్టి చికెన్ వ్యర్థాల వాహనంలో ఎక్కించారు. అక్కడ నుండి ఏపీలోని విజయవాడ, తిరువూరు మధ్యలో చీమలపాడు సమీపంలో ఓ చేపల చెరువులో మృతదేహాన్ని పడేశారు. కొన్ని రోజుల నుండి సాయి కనబడకపోవడంతో కోళ్ళ దుకాణం యజమాని, సాయి బంధువులు ఏమైందని సాయి భార్యను ఆరా తీశారు. అయితే ఆమె తనకు ఏమీ తెలియదని చెప్తూ వచ్చింది. దీంతో బంధువులు ఖమ్మం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయి భార్య కాల్ డేటా సేకరించారు. ఆమె ఎక్కువగా కరుణాకర్ నంబర్‌కి కాల్ చేసి గంటలు గంటలు మాట్లాడినట్లు తేలడంతో కరుణాకర్‌ను విచారించారు. దీంతో కరుణాకర్ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహానికి రాయి కట్టి ఓ చేపల చెరువులో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు వెతికేందుకు ఏపీ వెళ్ళారు. నాలుగు సార్లు చేపల చెరువులో మృతదేహం కోసం వెతుకులాట సాగించారు. అయినప్పటికీ దొరకలేదు. దీంతో చేపల చెరువు యజమానిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం బయటకు వచ్చి ఉండవచ్చునని, లక్షలు విలువ చేసే చేపలు చనిపోతాయన్న భయంతో ఆ యజమాని మృతదేహాన్ని బయటకు తీసి మరో కాలువలో పడేసి ఉండచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 25 రోజులైనా గాని మృతదేహం దొరక్కపోవడంతో మృతుని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇరు రాష్ట్ర పోలీసులకి ఈ కేసు పెద్ద తలనొప్పిగా మారింది.