ఫుడ్ డెలివరీ సేవల్లో ముందు వరుసలో నిలుస్తున్న జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 నగరాల్లో తన సేవలను నిలిపివేయనున్నట్లుగా ప్రకటించింది. ఇందుకు కారణం ఏంటి.. ఏ ఏ నగరాల్లో సేవలు నిలిపివేస్తుంది వంటి వివరాలు..
పదేళ్ల క్రితం వరకు మన దేశంలో ఆన్‌లైన్ వ్యాపారం గురించి ఆలోచించిన వారు కూడా చాలా తక్కువ. ఒకవేళ ఆలోచించాల్సి వచ్చినా.. వస్తువులు, బట్టలు వంటి వాటి గురించి ఆలోచించి ఉంటారు. అంతేతప్ప.. ఆకలేస్తే.. ఆన్‌లైన్ వైపు చూస్తాం అనే ఊహ కూడా ఎవరికి రాలేదేమో. కట్ చేస్తే.. ఇప్పుడు పొద్దున లేచింది మొదలు.. అర్థరాత్రి వరకు కూడా ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు.. జస్ట్ ఫోన్ చేతిలోకి తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేస్తే చాలు అరగంటలోపే మనం కోరుకున్న ఆహారం ఇంటికి వచ్చి చేరుతుంది. అంతలా ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ మన దేశంలో విస్తరించింది. ఇందుకు ముఖ్య కారణం జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు. పదేళ్ల కాలంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లు దేశ వ్యాప్తంగా ప్రజలకు ఎంతో చేరువయ్యాయి. మెట్రో నగరాలు మొదలు.. చిన్న చిన్న టౌన్‌లకు సైతం ఫుడ్ డెలివరీ సేవలు విస్తరించాయి. అయితే, కొద్ది రోజులుగా వ్యాపారం సరిగా లేకపోవడంతో ఈ ఫుడ్ డెలివరీ కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా సుమారు 225 చిన్న నగరాల్లో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గత డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. గత కొంత కాలంగా ఫుడ్ డెలివరీ వ్యాపారం సరిగా లేని నగరాల్లో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది జొమాటో. గ్రాస్ ఆర్డర్ విలువ 0.3 శాతం ఉన్న నగరాలకు ఇది వర్తిస్తుందని ఈ సందర్భంగా జొమాటో తెలిపింది.
‘‘గత కొన్ని త్రైమాసికాలుగా దేశంలోని సుమారు 225 నగరాల్లో మా ఫుడ్ డెలివరీ వ్యాపారం అంత ప్రోత్సాహకరంగా లేదు. ప్రస్తుతం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో నెలకొన్న ఈ పరిస్థితిని ఎవరూ ఊహించలేదు. ఇది మా వ్యాపార వృద్ధిపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కాకపోతే మా కంపెనీ నిర్దేశించుకున్న దీర్ఘకాల లక్ష్యాలను అందిపుచ్చుకోవడం అనేది మాకు చాలా ముఖ్యం. అందుకోసమే వ్యాపారం సరిగా లేని ఆయా నగరాల్లో మా సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం’’ అని ఓ ప్రకటనలో తెలిపింది జొమాటో. అయితే ఏ ఏ నగరాల్లో సేవలను నిలిపివేస్తున్నామనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.
మరోవైపు.. ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తమ సంస్థలో ఉద్యోగాలిస్తామని గత నెలలో జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ సంస్థలోని వివిధ విభాగాల్లో 800 మంది వరకు నియమిస్తామని తెలిపారు. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల క్రితం తన సంస్థలో పని చేస్తున్న మూడు శాతం సిబ్బందిని తొలగించిన జొమాటో.. ఇప్పుడు ఉద్యోగాలు కొల్పోయిన టెక్ నిపుణులకు తమ సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం వింతగా ఉందని అంటున్నారు. అంతేకాక ప్రస్తుతం మరో 225 నగరాల్లో సేవలను నిలిపివేయడం వల్ల మరింత మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఉన్న వాళ్లని తొలగించి బయట వాళ్లు ఉద్యోగాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి జొమాటో తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.