ఎస్‌బీఐ కార్డు ఉపయోగిస్తున్న ఖాతాదారులందరికి ముఖ్య గమనిక. ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే రెంట్ పేమెంట్స్ పై ప్రాసెసింగ్ ఛార్జీలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తమ ఖాతాదారులందరికి మెయిల్, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో సందేశాలు పంపింది.
మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా..? ఎస్‌బీఐ కార్డు ఉపయోగిస్తున్నారా..? అయితే మీపై ఇక బాదుడు షురూ అయినట్లే. ఎస్‌బీఐ బ్యాంకుకు ఉన్న పాపులారిటీతో ప్రతి ఒక్కరి దగ్గర ఎస్‌బీఐ కార్డు తప్పక ఉంటోంది. అలాంటి వారందరి కోసమే ఈ కథనం. క్రెడిట్ కార్డు ద్వారా చేసే రెంట్ పేమెంట్స్ ప్రాసెసింగ్ ఛార్జీలను భారీగా పెంచుతున్నట్లు ఎస్‌బీఐ కార్డు ప్రకటించింది. గతంలో ఈ రెంట్ పేమెంట్ ఛార్జీ ట్యాక్స్‌కు అదనంగా రూ.99గా ఉండగా, ఇప్పుడు దానిని ఏకంగా రూ.199 చేసింది. దీనికి ట్యాక్సులు అదనం. ఈ లెక్కన.. ప్రాసెసింగ్ ఫీజును రెట్టింపు చేసిందన్నమాట. ఆ వివరాలు..
గతేడాది నవంబర్ ముందు వరకు ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే రెంట్ పేమెంట్స్ పై ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండేవి కాదు. అప్పటినుంచే అమలులోకి తీసుకొచ్చింది. నవంబర్ నుంచి రెంట్ పేమెంట్స్ పై ప్రాసెసింగ్ ఛార్జీల పేరిట రూ. 99 వసూలు చేస్తోంది. దీనికి 18 శాతం జిఎస్‌టీ అదనం. తాజాగా, ఆ చార్జీలను మరోసారి పెంచింది. ఏకంగా రూ.199కి పెంచింది. దీనికి ట్యాక్సులు అదనం. ఈ మేరకు ఎస్‌బీఐ కార్డు తమ కస్టమర్లకు మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో సందేశాలు పంపింది. పెరిగిన ఛార్జీలు 17 మార్చి 2023 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
ఎస్‌బీఐ కార్డు సందేశాల ప్రకారం.. ”17 మార్చి, 2023 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో చేసే రెంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు మారతాయి..” అని ఉంది. కావున స్‌బీఐ కార్డు ఖాతాదారులందరూ రెంట్ పేమెంట్స్ చేసేటపుడు గమనించవల్సిందిగా మనవి. ఈ క్రమంలో రెంట్ పేమెంట్స్ పై ఇతర బ్యాంకులు ఎంత మేర ఛార్జీలు విధిస్తున్నాయో ఓసారి చూద్దాం.. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, ప్రభుత్వ బ్యాంకు ‘బ్యాంకు అఫ్ బరోడా’లు.. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే రెంట్ పేమెంట్స్‌పై ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తున్నాయి. ఒక్క ఎస్‌బీఐ కార్డు మాత్రమే నగదు రూపంలో ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది.
ఏదేమైనా ఎస్‌బీఐ కార్డు తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులపై అధిక భారాన్ని మోపేదే. చాలీ చాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకురావడానికి నానా అవస్థలు పడుతున్న సామాన్యులపై మరో గుదిబండ అని చెప్పుకోవాలి. ప్రతి నెలా సాధారణంగా చేసే చెల్లింపుల్లో అద్దె చెల్లింపు ప్రధానమైన ఖర్చుల్లో ఒకటి. కిరాయి ఇళ్లలో ఉండాలంటే సకాలంలో అద్దె చెల్లించాల్సిందే. అయితే.. కొన్ని అత్యవసర పరిస్థితులలో నగదు సమస్య వంటివి ఉన్నప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె చెల్లిస్తూ కాలాన్ని వెళ్లదీస్తుంటారు. ఇకపై ఆ అవకాశాన్ని కూడా లేకుండా చేసేలా ఉంది.. ఈ నిర్ణయం.