సాధారణంగా ఎవరైనా తాము పొదుపు చేసే లేదా పెట్టుబడి పెట్టే దానికి రెట్టింపు ఆదాయం రావాలని కోరుకుంటారు. అయితే కొందరు మాత్రం ఆదాయం తక్కువగా వచ్చినా కూడా నమ్మకమైన చోట పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. ఇంకొందరు ఆదాయం బాగా రావాలి అలాగే నమ్మకమైన సంస్థ అయి ఉండాలని చూస్తారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే స్కీమ్ ఇలాంటి అందరికీ చక్కని సమాధానంగా చెప్పొచ్చు. అది కూడా ఈ స్కీమ్ ఏ ప్రైవేటు సంస్థో కాదు.. పోస్టాఫీసుకు చెందిందే. చాలా మందికి ఈ పథకం గురించి తెలియకపోవచ్చు. అయితే మీరు కాస్త ఎక్కువ సమయం అయినా పర్లేదు.. నేను ఎదురు చూడగలను అనుకుంటే మాత్రం ఇది మీకు చక్కని ఆప్షన్ గా చెప్పొచ్చు.
ఇప్పుడు చెప్పుకోబోయే పొదుపు పథకం పేరు ‘కిసాన్ వికాస్ పత్ర’. దీనినే కేవీపీ స్కీమ్ అని చెబుతుంటారు. ఈ పథకంలో ఎందుకు చేరాలి? అసలు దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ పథకం జీవితకాలం 124 నెలలు.. అంటే 10 సంవత్సరాల 4 నెలల కాలం పడుతుంది. ఇటీవలే ఈ స్కీమ్ వడ్డీరేటుని కూడా పెంచారు. గతంలో 6.9 శాతంగా ఉన్న వడ్డీని 7శాతానికి పెంచారు. ఇలాంటి పథకాలకు ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వడ్డీని అలాగే ఉంచొచ్చు. కొన్నిసార్లు మాత్రం వడ్డీ రేటుని పెంచుతూ ఉంటాయి. ఈ పథకంలో చాలా వెసులుబాట్లు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది మీరు కేవలం రూ.వెయ్యి పెట్టుబడితో ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. అలాగే ఎలాంటి గరిష్ట పరిమితు లేదు. అంటే మీకు నచ్చిన మొత్తాన్ని మీరు ఈ స్కీమ్ కింద పొదుపు చేసుకోవచ్చు.
కేవీపీ స్కీమ్‌లో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. ఒకటి సింగిల్ అకౌంట్, రెండు జాయింట్ అకౌంట్. జాయింట్ అకౌంట్లో గరిష్టంగా ముగ్గురు మాత్రమే ఉండాలి. 10 సంవత్సరాల లోపు పిల్లల పేరు మీద కూడా గార్డియన్ గా ఉంటూ కేవీపీ అకౌంట్ ని ప్రారంభిచవచ్చు. స్కీమ్ లో చేరిన వ్యక్తి మరణిస్తే ఆ అకౌంట్ ని క్లోజ్ చేయచ్చు. లేదా వాళ్లకు సంబంధించిన వారి పేరు మీదకు కూడా దానిని బదిలీ చేయించుకోవచ్చు. మీరు డిపాజిట్ చేయం ప్రారంభించిన రెండేళ్ల 6 నెలల తర్వాత దీనిని ప్రీమెచ్యూర్ క్లోజ్ కూడా చేయచ్చు. కాకపోతే అప్పడు ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవచ్చు. మీరు పదేళ్ల పాటు నేను కచ్చితంగా ఆ మొత్తాన్ని కదిలించను అని నిర్ణయం తీసుకోవాలి. మీరు ఒక్కసారి డిపాజిట్ చేసినా కూడా మెచ్యూరిటీ సమయం వరకు వేచి ఉంటేనే మీకు రెట్టింపు ఆదాయం వస్తుంది. ఈ పథకాన్ని పిల్లల చదువు, పిల్లల పెళ్లి, విదేశీ పర్యటన, భవిష్యత్ అవసరాలు ఇలాంటి వాటికి నెలనెలా పొదుపు చేసుకుంటే చాలా బావుంటుందని చెబుతున్నారు.