పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు, వారి కాళ్లపై వాళ్లు నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. అలాగే వారిని బ్యాకింగ్ సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు ఇటీవలి కాలంలో జీరో బ్యాలన్స్ తో జన్ ధన్ ఖాతాలను కూడా ఓపెన్ చేయించారు. ప్రధానమంత్రి జన్ ధన్ ఖాథా స్కీమ్ కింద దాదాపు 47 కోట్ల ఖాతాలు తెరిచారు. అయితే మొదటి నుంచి వాటిని కేవలం ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే అనుకుంటున్నారు. అయితే ఆ ఖాతాల ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటి ద్వారా కొన్ని పథకాలను, ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఖాతాదారులకు రూ.1.30 లక్షల జీవిత బీమా కూడా అందుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఖాతాల వల్ల మరో ప్రయోజనాన్ని ప్రకటించారు.
అదేంటంటే.. ఇప్పుడు జన్ ధన్ ఖాతాదారులు రూ.10 వేలు పొందవచ్చు. అవును మీకు జన్ ధన్ ఖాతా ఉంటే మీ ఖాతా నుంచి రూ.10 వేలు పొందగలరు. అయితే దీనిని ఓవర్ డ్రాఫ్ట్ కింద అందజేస్తున్నారు. నిజానికి గతంలో ఇది రూ.5 వేలు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు ఈ సదుపాయాన్ని రూ.10 వేలకు పెంచారు. చాలా స్వల్ప వడ్డీతో మీరు ఈ మొత్తాన్ని పొందవచ్చు. దీనికోసం మీరు ఆన్ లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీ జన్ ధన్ ఖాతా ఉన్న శాఖకు వెళ్లి వారిని అడిగి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే చాలామందికి అసలు ఈ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. అయితే ఇది కూడా ఒక రకమైన లోన్ లాంటింది. మీరు క్రెడిట్ కార్డుల గురించి వినే ఉంటారు. ముందు డబ్బు వాడుకుని ఆ తర్వాత చెల్లిస్తారు. అలాగే ఈ జన్ ధన్ ఖాతా ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకుని రూ.10 వేలు ఓవర్ డ్రాఫ్ట్ పొందవచ్చు.
ఈ స్కీమ్ ద్వారా మీ ఖాతాలో వెయ్యి రూపాయలు ఉంటే మీరు రూ.11 వేలు డ్రా చేసుకోవచ్చు. మీ ఖాతాలో అసలు డబ్బు లేకపోయినా మీరు రూ.10 వేలు వాడుకోవచ్చు. అయితే ఈ ఓవర్ డ్రాఫ్ట్ కోసం కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ సదుపాయం పొందాలి అంటే జన్ ధన్ ఖాతాను మీరు కనీసం 6 నెలలు ఉపయోగించి ఉండాలి. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే ఈ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం లభిస్తుంది. ఎక్కువగా మహిళలకు ఈ అవకాశం ఉంటుంది. అన్ని బ్యాంకు ఖాతాల మాదిరిగానే వీళ్లు కూడా సిబిల్ స్కోర్ చూస్తారు. ఈ ఓవర్ డ్రాఫ్ట్ లో రూ.2 వేల వరకు ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. అయితే మీకు ఇప్పటివరకు జన్ ధన్ ఖాతా లేకపోతే.. ఇప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే.. బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.