ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించాలన్నా ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2003లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. మొదట ఈ పథకం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించేది. అయితే 2009లో ఈ పథకాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. 18-70 ఏండ్ల భారత పౌరులెవరైనా ఈ సీంలో చేరవచ్చు. అలా చేరిన వారు 60 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. తర్వాత ఒకేసారి భారీ మొత్తంలో రాబడి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి నెలా పెన్షన్ కూడా పొందొచ్చు.
18 నుంచి 70 ఏండ్ల భారత పౌరులెవరైనా ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. పథకంలో చేరిన వారు ఇన్వెస్ట్ చేసే డబ్బుల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్‌డీఏ) చూసుకుంటుంది. కావున పెట్టుబడి గురించి భయపడాల్సిన పనిలేదు. అలా చేరిన వారు వారికి 60 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత మెచ్యూరిటీ సమయంలో 60 శాతం డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక మిగిలిన 40 శాతం మొత్తంతో యాన్యుటీ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. మొత్తం డబ్బులు విత్‌డ్రా తీసుకోవడానికి ఉండదు.
ఉదాహరణకు మీకు 30 ఏళ్లు ఉన్నాయనుకుందాం. మీరు ప్రతి నెలా రూ.5 వేలు ఎన్‌పీఎస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు మెచ్యూరిటీ సమయంలో మొత్తంగా రూ.1.13 కోట్లు వస్తాయి. ఇందులో 60 శాతం విత్‌డ్రా చేసుకొని.. మిగిలిన 40 శాతంతో పెన్షన్ ప్లాన్ కొనాలి. అంటే రూ.68 లక్షల వరకు విత్‌డ్రా చేసుకొని.. మిగిలిన రూ.45 లక్షలను యాన్యుటీ ప్లాన్‌లో పెట్టాలి. ఇక్కడ వార్షిక రాబడిని 10 శాతంగా పరిగణలోకి తీసుకుంటే.. యాన్యుటీ ప్లాన్ ద్వారా నెలకు రూ.22 వేలు లభిస్తాయి. యాన్యుటీ రేటును 6 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం. అదే వార్షిక రాబడి 11 శాతం అనుకుంటే నెలకు రూ.25 వేలకు పైబడి పెన్షన్ పొందవచ్చు.
ఈ పథకంలో చేరాలనుకునేవారు ఎన్‌పీఎస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులు, కేఫిన్‌టెక్ వంటి సీఆర్‌ఏ ఏజెన్సీలూ ఈ అకౌంట్ ఓపెనింగ్ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. ఇందులోనెలకు కనిష్ఠంగా రూ.500లు, గరిష్ఠంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. కోరుకున్న పెన్షన్‌కు అనుగుణంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే.. 60 ఏండ్ల కంటే ముందు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొద్దిమొత్తంలో నగదును ఉపసంహరించుకొనే వీలుంది. అయితే.. ఇందులో పీపీఎఫ్ తరహాలో గ్యారెంటీగా ఇంత మొత్తం వస్తుందని ఉండదు. వయస్సులవారీగా, స్కీం ఆధారంగా రాబడులు ఉంటాయి. ఎన్‌పీఎస్‌లో 9-12 శాతం వార్షిక రాబడిని ఆశించవచ్చు.