ఇప్పటివరకూ ఐపీఎల్ మ్యాచులను ఉచితంగా ప్రసారం చేసిన జియో సినిమా యాప్ ఇకపై డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఐపీఎల్ మ్యాచులు ఉచితంగా చూడలేమా? సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎంత ఉంటుంది? ఎప్పటి నుంచి అమలు చేస్తుంది? అన్న అనుమానాలు వినియోగదారుల్లో మొదలయ్యాయి. మరి మీకేమైనా అనుమానాలు ఉంటే వెంటనే నివృతి చేసుకోండి.
ఐపీఎల్ ఉచితంగా ప్రసారం చేస్తున్న జియో సినిమా యాప్ కోసం ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే. ఈ విషయాన్ని జియో కంపెనీ వెల్లడించింది. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను దక్కించున్న రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకామ్ 18.. జియో సినిమా యాప్ ద్వారా ఉచితంగా మ్యాచులను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉచితం కాన్సెప్ట్ తో జియో సినిమా యాప్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఐపీఎల్ మ్యాచ్ ముందు వరకూ జియో సినిమా యాప్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు జియో సినిమా అంటే తెలియని క్రికెట్ లవర్ లేరు. అంతలా క్రికెట్ ఫీవర్ ని క్యాష్ చేసుకుంది జియో కంపెనీ. ఈ ఐపీఎల్ ద్వారా వచ్చిన క్రేజ్ ను జియో సినిమా యాప్ డెవలప్మెంట్ కోసం వాడుకుంటుంది.
మొదట ఉచితంగా అలవాటు చేయడం, ఆ తర్వాత డబ్బులు ఛార్జ్ చేయడం అనేది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ బిజినెస్ స్ట్రాటజీ. ఐపీఎల్ మ్యాచుల ప్రసారాలతో ఒక్కసారిగా విపరీతమైన ఆదరణ పొందింది జియో సినిమా. జియో సినిమాను అతి పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ గా మార్చేందుకు రిలయన్స్ సంస్థ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం జియో సినిమా యాప్ లో వందకు పైగా సినిమాలు, టీవీ సిరీస్ లను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ లకు చెక్ పెట్టాలని భావిస్తోంది. జియో యాప్ లో సినిమాలు, సిరీస్ లు పెట్టినందుకు గాను మీ జేబుల్లోంచి కొంత డబ్బు విరగ్గోసేస్తామోయ్ అంటూ జియో కంపెనీ ప్రకటించింది.
అయితే ఐపీఎల్ మ్యాచులకు మాత్రం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని పేర్కొంది. ఈ విషయాన్ని రిలయన్స్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్ పాండే వెల్లడించారు. కొత్తగా సినిమాలు, సిరీస్ కంటెంట్ చేర్చిన తర్వాతే సబ్స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేస్తామని అన్నారు. అయితే ఎంత ఛార్జీలు వసూలు చేయాలన్న విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని అన్నారు. ఐపీఎల్ మ్యాచులు మే 28వ తేదీతో ముగియనున్నాయి. ఆలోపే యాప్ లో కొత్త కంటెంట్ యాడ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. అయితే అప్పటి వరకూ ఐపీఎల్ మ్యాచులను ఉచితంగా చూడవచ్చునని అన్నారు. అయితే సబ్స్క్రిప్షన్ ఛార్జీలు అందుబాటు ధరలోనే ఉంటాయని పేర్కొన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.