కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పిఎం కిసాన్ యోజన‘లో అన్నదాతల సంఖ్య 10 కోట్లు దాటింది. 2019 ప్రారంభంలో 3.16 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య 2022 నాటికి మూడింతలు పెరిగింది. దీనంతటికి కారణం.. ఈ పథకంలో ఉన్న లొసుగులే అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ విషయంపై సంబంధిత మంత్రిత్వ శాఖ కూడా స్పదించింది. అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించింది. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకంలో జరుగుతున్నా అక్రమాలేంటి? ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘రైతు బంధు’ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 24 ఫిబ్రవరి 2019న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులందరికీ ఏటా రూ.6,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ డబ్బులు రూ.2,000 చొప్పున మూడు విడతలుగా అన్నదాతల ఖాతాల్లో జమ అవుతోంది. ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నా.. ప్రతి ఏటా ఈ పథకంలో చేరుతున్న రైతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2019 ప్రారంభంలో 3.16 కోట్లుగా ఉన్న లబ్ధిదారుల సంఖ్య సోమవారం(నవంబర్ 21) నాటికి 10 కోట్ల మార్కును దాటింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్య అంతకంతకూ పెరగడానికి లొసుగులే కారణమంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
చిన్న, సన్నకారు రైతుల కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని, అందులో ఉన్న లోసుగులను బేస్ చేసుకొని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఒకరి పేరు మీద ఎక్కువ భూమి ఉంటే రాదు అన్న ఉద్దేశ్యంతో.. సదరు భూమిని ఇంటి సభ్యుల పేరుతో సమభాగాలుగా విడగొట్టి లభ్డిపోందుతున్నట్లు వివరించారు. వీటిని నిలువరించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలేంటి అని ప్రశ్నించారు. ఈ విషయంపై స్పందించిన సదరు మంత్రిత్వ శాఖ అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించింది. అనర్హుల ఖాతాల్లోకి చేరిన సొమ్మును తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.
ఇందులో భాగంగా పథకంలో ఇప్పటి వరకు 8 మార్పులు చేసినట్లు వెల్లడించింది. లబ్దిదారులు అందరూ తమ డాక్యుమెంట్లను అప్ డేట్ చేయాలని కోరింది. నకిలీలకు చోటివ్వకుండా మార్పులు చేసిన తర్వాత లబ్దిదారుల తాజా వివరాలను, సంబంధిత పత్రాలను అప్ లోడ్ చేయాలని సూచించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా డబ్బులు పొంది, ఇప్పుడు వివరాలు అప్ డేట్ చేయని వాళ్లందరినీ మోసగాళ్ల జాబితాలో చేర్చనుందట. ఈ నకిలీ రైతుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందట. కిసాన్ యోజన ద్వారా ఇప్పటి వరకు అందుకున్న సొమ్మును ప్రభుత్వం తిరిగి వసూలు చేయడంతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని అధికారవర్గాల సమాచారం. నకిలీ పత్రాలతో ఈ పథకంలో చేరితే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డబ్బులను రిటన్ చేయవచ్చు. స్వచ్చంధంగా సొమ్మును తిరిగిచ్చే వాళ్లపై ఎలాంటి చర్యలు ఉండవని అధికారులు చెప్పారు.
“రైతులు 13వ విడత ప్రయోజనాన్ని పొందాలనుకుంటే తప్పనిసరిగా PM కిసాన్ KYC స్థితిని తనిఖీ చేయాలి. మీరు ముందుగా పథకం అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inని సందర్శించి, అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల భూమి వివరాలను రాష్ట్రాల భూ రికార్డుల ప్రకారం సీడింగ్ చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో రాష్ట్రాల డిజిటల్ ల్యాండ్ రికార్డులతో సజావుగా పనిచేసేలా కనెక్టివిటీని నిర్ధారిస్తుంది” అని పిఎం కిసాన్ యోజన తెలిపింది. ఈ పథకంలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి రైతుల e-KYC మరియు ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ (APB)ని ఉపయోగించి మంత్రిత్వ శాఖ చెల్లింపులను ప్రారంభించింది.
పీఎం కిసాన్ ఈ-కేవైసీ ప్రక్రియను బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో కూడా పూర్తి చేయవచ్చు. రైతులు తమకు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్లి, బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయవచ్చు.