ఏటీఎం కార్డు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటోంది. కానీ, దాని వల్ల కలిగే ప్రయోజనాలు అతి కొద్ది మందికే తెలుసు. మరీ ముఖ్యంగా ప్రమాద బీమా లభిస్తుందన్న విషయం బ్యాంకు సిబ్బందికి తప్ప మరెవరికి తెలియదన్న ఆశ్చర్యపోనవరసం లేదు. దాదాపు అన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని తమ కస్టమర్లకు కల్పిస్తున్నాయి.
బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరి వద్ద ఏటీఎం కార్డు ఉంటుంది. దీన్ని ‘డెబిట్ కార్డు’ అని కూడా పిలుస్తారు. ఖాతాలో ఉన్న నగదును డ్రా చేయడానికి దీనిని ఎక్కువుగా ఉపయోగిస్తుంటారు. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే.. డెబిట్ కార్డుతో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్(ప్రమాద బీమా) సదుపాయం పొందవచ్చు. అంటే.. కార్డుదారునికి ఏదేని ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందినా/ ప్రమాదంలో కార్డుదారుడు మరణించినా ఈ బీమా వర్తిస్తుంది. అందుకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను బ్యాంకుకు అందజేసి బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ భీమా అనేది ఏటీఎం కార్డు రకాన్ని బట్టి రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఈ సదుపాయాన్ని ప్రైవేట్ బ్యాంకులు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ సహా దాదాపు అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు కల్పిస్తున్నాయి.
మొదట మీరు వాడుతున్న ఏటీఎం కార్డు రకాన్ని బట్టి బీమా ఉందా! లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. బీమా ఉన్నట్లయితే.. కార్డుదారునికి జరిగిన ప్రమాదం ఏంటి..? ఆసుపత్రిలో చికిత్స పొందిన బిల్లులను బ్యాంకు సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాదవశాత్తూ కార్డుదారులు మరణిస్తే క్లెయిం దరఖాస్తుకు డెత్ సర్టిఫికెట్, శవపరీక్ష నివేదికను జత చేయాల్సి ఉంటుంది. ప్రమాద బీమా తో పాటు కొన్ని బ్యాంకులు ‘పర్చేజ్ ప్రొటెక్షన్’ను కూడా అందిస్తున్నాయి. అంటే షాపింగ్ చేసేటప్పుడు జరిగే మోసపూరిత లావాదేవీలపై కూడా బీమా పొందొచ్చు. అయితే, డెబిట్ కార్డుపై బీమా క్లెయిం చేసుకోవాలంటే ఒక షరతు ఉంటుంది. కార్డుదారుడు ప్రమాదానికి గురి కావడం లేదా చనిపోవడానికి ముందు 30 రోజుల్లో కనీసం ఒక్కసారైనా కార్డుని ఉపయోగించి ఉండాలి. కొన్ని బ్యాంకుల్లో ఈ గడువు 60, 90 రోజుల వరకు ఉంది.
ఉదాహరణకు ఎస్బీఐ ఎటిఎం కార్డులు తీసుకుంటే.. అధికారిక ఎస్బీఐ వెబ్సైట్ వివరాల ప్రకారం.. గరిష్ఠంగా 20 లక్షల వరకూ ప్రమాద బీమా లభిస్తుంది. అయితే.. యాక్సిడెంట్ జరిగిన నాటికి తొంభై రోజుల వ్యవధిలో కనీసం ఒకసారైనా ఏటీఎం కార్డు వినియోగించిన వారు మాత్రమే ఈ బీమాకు అర్హులు. అలాగే.. విమాన ప్రయాణంలో మరణిస్తే, ప్రమాదం జరిగిన నాటికి తొంభై రోజుల వ్యవధిలో కనీసం ఒకసారైనా ఏటీఎం కార్డు వినియోగించి ఉండాలి. మరియు ఆ విమాన ప్రయాణ టికెట్ ను సదరు ఏటీఎం కార్డును ఉపయోగించి కొనుగోలు చేసి ఉండాలి. పైన చెప్పబడిన నియమ నిబంధనలు వర్తిస్తే.. మరణించాక సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించి బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారాన్ని గూగుల్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం అందిస్తున్నాం. మరిన్ని పూర్తి వివరాలకు బ్యాంకు సిబ్బందిని సంప్రదించండి.