ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ‘మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు’ అయ్యింది ప్రస్తుతం ప్రజల పరిస్థితి. గ్యాస్, పెట్రోల్, డీజిల్, కూరగాయ ధరలు ఓ పక్క మండిపోతుంటే.. ఇవి చాలదు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారం ప్రజలపై మోపనుంది. విద్యుత్ వినియోగదారులపై ఇక నుంచి భారం పడనుంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను తాజాగా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి( ERC)బుధవారం ఓ ముసాయిదాని జారీచేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
సాధారణంగా అంతర్జాతీయ ధరలను బట్టి పెట్రోల్, డీజిల్ రేట్లు ఎప్పుటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. ఇక నుంచి అలాగే పెరగనున్నాయి విద్యుత్ ఛార్జీలు. అవును రానున్న ఏప్రిల్ నుంచి నెల నెల విద్యుత్ బిల్లులను యూనిట్ కు 30 పైసలు చొప్పున డిస్కం లు నేరుగా పెంచుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ”రాష్ట్ర విద్యుత్ నియంత్రణ రెండో సవరణ ఉత్తర్వు – 2022” బిల్లు కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే యూనిట్ కు 30 పైసలు విద్యుత్ బిల్లులు పెంచుకునే అనుమతి రాష్ట్రానికి చెందిన విద్యుత్ డిస్కంలకు లభించింది.
ఒకవేళ ఈ బిల్లుల పెంపు యూనిట్ కు 30 పైసలకు మించితే కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంధన ఛార్జీల సర్దుబాటు పేరుతో గతంలో ఏడాదికోసారి బిల్లులు పెంచేవారు. దాంతో ప్రజలపై అధికభారం పడుతోందని, ఇలా నెల నెల కరెంట్ ఛార్జీలను సవరించాలని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది. అందులో భాగంగానే ఈ ERC సవరణ ఉత్తర్వులను తీసుకొచ్చామని కమిషన్ ఛైర్మన్ శ్రీరంగరావు తెలిపారు. ఈ సవరణతో విద్యుత్ వినియోగదారులపై భారం పడనుంది. నెల నెలా కరెంట్ బిల్లులు పెంచుకుంటూ పోతే ఎలా అని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కరెంట్ బిల్లుల భారం తడిసి మోపెడు అవుతుంటే మరో సారి ఇలా సవరణల పేరుతో ప్రజల నెత్తిన పిడుగు పడ్డట్లు అయ్యింది.