ఒకప్పుడు ఫోన్ రీఛార్జ్ నెలంతా వచ్చేది. ఇప్పుడు తెలివితేటలు చూపిస్తూ 28 రోజులకే పెడుతున్నారు. దీని వల్ల 13 నెలలు రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తుంది. అయితే నెల రీఛార్జ్ లు చేసే సరికి సామాన్యులకు భారంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ని ఎంచుకుంటే కొంత డబ్బు ఆదా అవుతుంది. ప్రతి రూపాయి విలువైనదే అని ఆలోచించేవారు, ఆచి తూచి ఖర్చు పెట్టేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
భారతదేశంలో ప్రస్తుతం టెలికాం వార్ జరుగుతోంది. వినియోగదారులను ఆకర్షించడానికి టెలికాం కంపెనీలు ఆఫర్లను, అద్భుతమైన ప్లాన్స్ ని పరిచయం చేస్తుంటాయి. తక్కువ ధరకే మంచి ప్లాన్ కావాలని కోరుకునే వారికి బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్ ని అందిస్తోంది. కేవలం రూ. 139 రీఛార్జ్ ప్లాన్ తో 28 రోజుల పాటు ప్రతి రోజూ 1.5 జీబీ డేటా పొందడంతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. డైలీ 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ఇచ్చే ఇతర కంపెనీలు అయితే రెండింతలు ఛార్జ్ చేస్తున్నాయి. డైలీ 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు కలిగిన 28 రోజుల ప్లాన్ ని ఎయిర్ టెల్ రూ. 299కి అందిస్తుంది. ఇదే ప్లాన్ ని జియో అయితే రూ. 239 ఛార్జ్ చేస్తుంది.
వొడాఫోన్ ఐడియా అయితే రూ. 299 వసూలు చేస్తుంది. అయితే వీటి కంటే తక్కువ ధరకే బీఎస్ఎన్ఎల్ అందజేస్తుంది. రూ. 187కే డైలీ 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లతో కూడిన 28 రోజుల ప్లాన్ ని బీఎస్ఎన్ఎల్ అందజేస్తుంది. డైలీ 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లతో కూడిన 28 రోజుల ప్లాన్ ని ఎయిర్ టెల్ రూ. 265కే అందిస్తుంటే.. వొడాఫోన్ ఐడియా రూ. 269కి, జియో రూ. 209కి అందిస్తున్నాయి. ఇదే ప్లాన్ ని బీఎస్ఎన్ఎల్ రూ. 186కే అందిస్తుంది. డైలీ 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు కలిగిన 28 రోజుల ప్లాన్ కావాలనుకుంటే ఎయిర్ టెల్ రూ. 359, జియో రూ. 299కి ఇస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా అయితే ఇదే ప్లాన్ ని 30 రోజుల వ్యాలిడిటీతో రూ. 368, రూ. 369కి ఇస్తుంది.
ఇదే ప్లాన్ ని 28 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ రూ. 269కే అందజేస్తుంది. అయితే బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ప్లాన్స్ లో అతి తక్కువ ధర కలిగిన ప్లాన్ అయితే రూ. 139 ప్లానే. ఇప్పుడు చాలా మంది వాట్సాప్ వాడుతున్నారు. ఎవరికి ఏం మెసేజ్ పెట్టాలన్నా వాట్సాప్ లోనే పెడుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీని యాప్స్ రిజిస్టర్ చేసుకునే సమయంలో తప్పితే పెద్దగా ఈ ఎస్ఎంఎస్ ల అవసరం ఉండదు. కాబట్టి ఎస్ఎంఎస్ లు అవసరం లేని వారు బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ. 139 ప్లాన్ తీసుకుంటే ప్రతి నెలా కొంత డబ్బు ఆదా చేసుకునే వీలుంటుంది. ప్రతి నెలా మీరు చెల్లించే డబ్బులో సగం వరకూ ఆదా చేసుకోవచ్చు.