ఇటీవల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ లో నెలకొన్న అనిచ్చితి కారణంగా ఐటీ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ట్విట్టర్, మెటా, ఫేస్ బుక్ .. తమ సంస్థలోని కొందరు ఉద్యోగులను తొలగించింది. అలానే పలు ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా కొందరు ఉద్యోగులను తొలగించుకుని ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటి బాటలోనే తాజాగా మరో కంపెనీ వచ్చి చేరనుంది. ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది.
అమెజాన్ కంపెనీ వందా, రెండు వందలు కాదు ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపనుందని తెలుస్తోంది. వాయిస్-అసిస్టెంట్ అలెక్సా, దాని రిటైల్ విభాగం, మానవ వనరుల విభాగ ఉద్యోగాలలో ఎక్కువగా తొలగింపులు ఉంటాయని సమాచారం. 2021 డిసెంబర్ 31 నాటికి, అమెజాన్‌లో దాదాపు 16 లక్షల మంది ఫుల్‌టైమ్-పార్ట్‌టైమ్ ఉద్యోగులు ఉన్నారు. ఇటీవల కొంతకాలం నుంచి అమెజాన్ కంపెనీ లాభాలు తగ్గుముఖం పట్టాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రతి ఏడాది పండుగల సీజన్ లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగేది. అయితే ఈ సారి మాత్రం అమ్మకాల్లో అనుకున్న స్థాయిలో పురోగతి కనిపించలేదని పేర్కొన్నాయి. దీంతో సంస్థ యాజమాన్యం దీనిపై పరిశీలన చేసుకుంది. కంపెనీలోని పెద్దగా లాభదాయకం లేని విభాగాలను గుర్తించి, అందులోని ఉద్యోగులను తొలగించున్నంది. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికి సంబంధిత ఉద్యోగులకు చేరవేసింది.
కంపెనీల్లోనే ఇతర విభాగాల్లో లేదా ఇతర కంపెనీల్లో అవకాశాలు వెతుక్కోవాలని సూచింటినట్లు తెలిసింది. సాధారణ పరిస్థితులలో అమెజాన్ ఏటా అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మంది ఏటా అమెజాన్ లో చేరుతుంటారు. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చేయడంపై జనం ఎక్కువగా దృష్టి పెట్టారని, దాని ఫలితంగానే ఈసారి ఆశించినంతగా అమ్మకాలు నమోదు కాలేదని తెలిపిందని అమెజాన్ తెలిపింది. అందుకే గత కొంతకాల నుంచి ఉద్యోగుల నియామకాలనూ ఆపేసింది. వేర్ హౌస్ ల నిర్మాణాన్ని కూడా వీలైనంత వరకు వాయిదా వేస్తూ వస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు పలు విభాగాలలోని సుమారు 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనంలో పేర్కొంది.