జూలై 1న హెచ్డీఎఫ్సీ బ్యాంకు.. హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ)తో విలీనం అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరొక ప్రముఖ బ్యాంకు విలీనాన్ని ప్రకటించింది.
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో విలీనం అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరొక ప్రముఖ బ్యాంక్ కూడా తన మాతృసంస్థలో విలీనం అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో మాతృసంస్థ ఐడీఎఫ్సీ లిమిటెడ్ విలీనం కాబోతుంది. ఇందుకు రెండు సంస్థల బోర్డులూ ఆమోదం తెలిపినట్లు ఐడీఎఫ్సీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు వెల్లడించాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సోమవారం జరిగిన తమ సమావేశంలో షేర్ల మార్పిడి ద్వారా ఐడీఎఫ్సీతో లావాదేవీలు చేపట్టనున్నట్లు నిర్ణయించారు. ఈ ఏడాదిలోగా ఈ విలీనాన్ని పూర్తి చేయాలని ఐడీఎఫ్సీ భావిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హోసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విలీనం తర్వాత 2023 ఆర్థిక రంగంలో రెండవ ప్రధాన విలీనం ఇదే కానుంది.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో ఐడీఎఫ్సీ 40 శాతం వాటాను కలిగి ఉంది. ఐడీఎఫ్సీ పూర్తిగా ప్రజల అధీనంలో ఉంది. ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కార్పొరేట్ నిర్మాణాన్ని సరళీకృతం చేయడానికి ఐడీఎఫ్సీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు విలీనం దారి తీస్తుంది. ఏ ప్రమోటర్ హోల్డింగ్ లేకుండా ఇతర పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లా విభిన్నమైన ప్రజల షేర్ హోల్డర్లు, సంస్థాగత షేర్ హోల్డర్లతో సంస్థను సృష్టించడానికి ఈ విలీనం ఉపయోగపడుతుందని ఐడీఎఫ్సీ బ్యాంకులు వెల్లడించాయి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా, ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, అండ్ ఎక్స్ ఛేంజెస్ నుంచి అవసరమైన అనుమతులకు లోబడి ఉంటుంది.
విలీన ప్రతిపాదన ప్రకారం ఐడీఎఫ్సీ వాటాదారులకు తమ వద్ద ఉన్న ప్రతీ 100 షేర్లకు గాను 155 ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు షేర్లను జారీ చేయనున్నారు. మౌలిక రంగానికి రుణాలను అందించేందుకు 1997లో ఆవిర్భవించింది ఈ ఐడీఎఫ్సీ. ఏప్రిల్ 2014లో ఐడీఎఫ్సీ బ్యాంకుని ప్రారంభించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. తదనంతరం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 2015లో కార్యకలాపాలను ప్రారంభించింది. 2018 డిసెంబర్ లో ఐడీఎఫ్సీ బ్యాంకు, క్యాపిటల్ ఫస్ట్ తో విలీనం అయ్యింది. దీంతో బ్యాంకు పేరు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకుగా మారింది. జూన్ 30 2023 నాటికి తన నాన్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ ద్వారా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో 39.93 శాతం వాటాను ఐడీఎఫ్సీ కలిగి ఉంది.
మార్చి 31 నాటికి బ్యాంక్ రుణ పుస్తకం 1.6 ట్రిలియన్స్ గా ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.6 లక్ష కోట్లు. బలమైన డిపాజిట్ ఫ్రాంచైజ్, డిజిటల్ ఇన్నోవేషన్, కస్టమర్ ఫ్రెండ్లీ ప్రాడెక్ట్స్, బలమైన క్యాపిటల్ బఫర్, లాభాలు పెంచుకోవడానికి, అధిక కార్పొరేట్ పాలన వంటి వాటి కోసం ఈ విలీనం ద్వారా బలమైన పునాదిని నిర్మిస్తున్నామని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు ఎండీ మరియు సీఈఓ వి వైద్యనాథన్ అన్నారు. ఉన్న షేర్ హోల్డర్లు, కొత్త షేర్ హోల్డర్ల మద్దతుతో భారతదేశంలో వరల్డ్ క్లాస్ బ్యాంకుని క్రియేట్ చేయాలన్న తమ విజన్ ని నిర్మించడానికి మేము ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: ఖాతాదారులకు అలర్ట్.. జూలై 1 నుండి HDFC కనిపించదు..