ఓ వివాహిత పట్ల గ్రామ సచివాలయ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ కుటుంబ సభ్యులు అతనిని మందలించగా అర్ధరాత్రి రివాల్వర్ తో బెదిరింపులకు దిగాడు. దీంతో అక్కడి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కుటుంబ కలహాల కారణంగా చాలా మంది విడిపోతున్నారు. విడిపోయి వారి ఇష్టానుసారంగా వేరే వారితో సహజీవనం గడుపుతున్నారు. ఇది సమాజంలో కామన్ అయిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చే పరిణామాలను గుర్తించట్లేరు. అలాంటి సంఘటనే తాజాగా ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామ సచివాలయ ఉద్యోగి వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ యొక్క కుటుంబసభ్యులు అతనిని మందలించారు. దీంతో గ్రామ సచివాలయ ఉద్యోగి అర్ధరాత్రి సదరు మహిళ ఇంటివద్ద గందరగోళం సృష్టించాడు. స్థానికులంతా కలిసి అతనిని పోలీసులకు అప్పగించారు. పూర్తి వివారాల్లోకి వెళితే..
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని రాజుపాలెం గ్రామంలో మాజీ సైనిక ఉద్యోగి ఉన్నాడు. అతని పేరు మోహన్ రెడ్డి. ప్రస్తుతం రాజుపాలెం గ్రామంలో సచివాలయంలో పశు సంవర్ధక సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటుంది. గత కొంతకాలంగా మోహన్ రెడ్డి ఆ మహిళతో చాలా చనువుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మహిళ భర్తవచ్చి భార్యతో ఉంటున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటున్నారు. అయితే ఆ మహిళ మోహన్ రెడ్డితో మాట్లాడడం చాలావరకు తగ్గించింది. దీంతో మోహన్ రెడ్డి భరించలేక మహిళ ఫోన్ కు అసభ్యకరమైన మెసేజ్ లు పంపించాడు. మోహన్ రెడ్డిని వివాహిత కుటుంబసభ్యులు ఆగ్రహంతో గట్టిగా మందలించారు. దీంతో మోహన్ రెడ్డి బుధవారం అర్ధరాత్రి వివాహిత ఇంటివద్దకు వచ్చి అసభ్యకరమైన మాటలతో రెచ్చిపోయాడు. తన లైసెన్స్ రివాల్వర్ తో హంగామా చేశాడు. స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి స్తంభానికి కట్టేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.