ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆరడుగుల ఆజానుబాహుడు, కండలు తిరిగిన దేహం, బాడీ బిల్డర్‌ను తలపించే స్ట్రక్చర్, ఫుల్ అండ్ ఫిట్‌నెస్, నో హెల్త్ ఇష్యూస్, ఇదీ మంత్రి గౌతమ్‌రెడ్డి టోటల్ హెల్త్ ప్రొఫైల్. అలాంటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయారంటే ఎవ్వరూ నమ్మలేకపోయారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి తన ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద వహిస్తుంటారని ఆయన సన్నిహితులు అంటుంటారు.. ఎక్కడికి వెళ్లినా ఖచ్చితంగా కొన్ని గంటల పాటు ఆయన వ్యాయామం తప్పకుండా చేస్తుంటారని అంటుంటారు. అందరినీ ఆకర్షించే మంత్రి గౌతమ్ రెడ్డి కండల వెనుక కఠోర శ్రమ, క్రమశిక్షణ దాగున్నాయని ఆయన్ను దగ్గరగా చూసేవారు చెబుతారు. గౌతమ్ రెడ్డికి ‘జిమ్’ ఆరో ప్రాణంగా చెబుతారు. ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా సరే ఉదయం, సాయంత్రం గంట నుంచి రెండు గంటల సేపు ఆయన జిమ్‌లో గడుపుతారు. హైదరాబాద్ తన నివాసంలో మంత్రి గౌతమ్ రెడ్డి జిమ్ కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకున్నారు. గౌతంరెడ్డి ఆహార ప్రియుడు అనే ప్రచారం ఉన్నా, ఎంత తింటారో అంత ఖర్చు చేసేవరకు జిమ్ రూమ్ వదలి బయటకు రాడని, ఆ కారణంగానే ఆయన శరీరాకృతి అంత ఫిట్‌గా ఉంటుందని అనుచరులు చెబుతారు.
గౌతమ్ రెడ్డి కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆయన జిమ్ లో షర్ట్ లేకుండా కఠినతరమైన వ్యాయామం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో గౌతమ్ రెడ్డిని చూస్తుంటే నిజంగా బాహుబలిని మించిన బాడీలా కనిపిస్తుంది. అంత ఫిట్ నెస్ బాడీ కలిగి ఉన్నా కూడా గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పొందండం అందరి హృదయాలు కలచి వేస్తుంది. ఇటీవల ప్రముఖ కన్నడ నటుడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నా జిమ్ చేసిన తర్వాత తీవ్ర అస్వస్థతకు లోను కావడం.. ఛాతీ నొప్పితో కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జిమ్ లో వ్యాయామం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.