సెలబ్రిటీలకు అందులోనూ సినీ తారలకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటించే ప్రతిభ ఎంత ఉన్నా ఫిజిక్ కాపాడుకోవాల్సిందే. అప్పుడే మరిన్ని అవకాశాలు వరిస్తాయి. అందుకే ఫిట్నెస్ కోసం జిమ్‌లో ఒక లెవల్లో చెమటోడుస్తుంటారు తారలు.
ఈ రోజుల్లో ఫిట్నెస్ అనేది అందరికీ తప్పనిసరిగా మారింది. కరోనా తర్వాత అందరికీ దీని విలువ తెలిసొచ్చింది. ఏ రోగాన్ని తట్టుకోవాలన్నా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాల్సిందే. సామాన్యుల మాట అటుంచితే.. సెలబ్రిటీలు ఈ విషయంలో ఎంత పక్కాగా ఉంటారో తెలిసిందే. ముఖ్యంగా సినీ తారలు ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఎంత బాగా నటించినా, ఫిట్‌గా ఉండటం వారికి తప్పనిసరిగా మారింది. అందుకే వర్కవుట్లు చేస్తూ జిమ్‌లో చెమటోడుస్తుంటారు హీరోలు, హీరోయిన్లు. నటులతో పాటు వారి లైఫ్ పార్ట్నర్స్ కూడా ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డిని ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. హీరోయిన్లకు తీసిపోని అందం, ఫిజిక్‌తో అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నారామె.
ఫిట్నెస్ విషయంలో సీనియర్ హీరోయిన్లు కూడా తగ్గేదేలే అంటున్నారు. అందుకు శ్రియ, నయనతార, త్రిషలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ లిస్టులోకి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి, నటి జ్యోతిక కూడా చేరారు. పెళ్లైన తర్వాత చాలా సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక, ఈమధ్య ముఖానికి రంగు వేసుకోవడం మొదలుపెట్టారు. ఆమె వరుసబెట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్‌కు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారామె. ఫిజిక్‌ను కాపాడుకునేందుకు జిమ్‌లో చెమటోడ్చుతున్నారు. తన వర్కౌట్ సెషన్‌కు సంబంధించి జ్యోతిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోను బట్టి ఆమె డెడికేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.