వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. కానీ కొంతమంది మనీ మైండెడ్ వైద్యులు వైద్యులకున్న డెఫినిషన్ నే మార్చేశారు. గుండు నొప్పి వచ్చిందని హాస్పిటల్ కి వెళ్తే.. గుండె నొప్పి వచ్చిందని చెప్పి లక్షలు బిల్లు వేస్తారు. గుండెకు చిల్లు పడిందని చెప్పి జేబుకి చిల్లు పెడతారు. ఇక ప్రసవం కోసం హాస్పిటల్ కి వెళ్తే సరే సరి. సహజ ప్రసవం అయ్యే దాన్ని కూడా సిజేరియన్ చేయాలని చెప్పి వేలకి వేలు, లక్షలు వసూలు చేస్తారు. పాపం ప్రాణం అంటే తీపి ఉన్న మధ్యతరగతి వ్యక్తులు డాక్టర్లు చెప్పింది నమ్మి తమ దగ్గరున్నయన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తారు. ఇక్కడితో అయిపోయిందా?
జుట్టు నుంచి బొటనవేలి వరకూ ఏ చిన్న సమస్య ఉన్నా బతకడం కష్టం, ఆపరేషన్ చేయాల్సిందే అని పరేషాన్ చేస్తారు. చివరికి ప్రాణాలతో కూడా చెలగాటం ఆడతారు కొంతమంది. ప్రాణాలు కాపాడవలసిన డాక్టరే డబ్బుల కోసం శవంతో ఆటలాడతాడు. మిగతా డబ్బులు కడితేనే శవాన్ని అప్పగించే హాస్పిటళ్లు ఉంటాయి. మిగతా డబ్బు కట్టేవరకూ మరణించిన విషయం చెప్పకుండా దాచిపెట్టే సిబ్బంది కూడా ఉంటారు. వీళ్ళకి కావాల్సింది కేవలం డబ్బులే, మనుషుల ఎమోషన్ తో పని లేదు. అందరూ డబ్బుతో వ్యాపారం చేస్తే.. కొంతమంది డాక్టర్లు మాత్రం మనుషుల ఎమోషన్స్ తో వ్యాపారం చేస్తున్నారు. వైద్యం అంటే వ్యాపార రంగమే కావచ్చు. కానీ ఎమోషన్స్ తో వ్యాపారం చేయడం మాత్రం నేరం.
ఎప్పుడో 2003లో వచ్చిన ఠాగూర్ సినిమాలో.. శవానికి చికిత్స చేసిన సన్నివేశం ఒకటి చూసే ఉంటారు. ఆ సన్నివేశంలో చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేస్తారు. కాసేపు హడావుడి చేసి.. అటూ ఇటూ తిరుగుతూ.. ఏదో బతికించేస్తున్నామన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత దీనంగా మొఖం పెట్టి.. ‘క్షమించండి, మేము సాధ్యమైనంత వరకూ ప్రయత్నించాం. కానీ బతికించలేకపోయాం’ అని చెప్పి.. మిగతా డబ్బు కట్టి శవాన్ని తీసుకెళ్లమని అంటారు. శవానికి చికిత్స చేయడమే కాకుండా శవాన్ని కూడా అమ్ముతున్నారు. ఇలాంటి సన్నివేశాలు నిజ జీవితం నుంచే పుట్టుకొస్తాయి. తాజాగా ఓ హాస్పిటల్ లో చనిపోయిన వ్యక్తికి ఆక్సిజన్ ఎక్కిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియోలో.. చనిపోయిన మనిషికి ఆక్సిజన్ సిలిండర్ పెట్టి నాటకం ఆడుతున్నారా అని ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నారు. మనిషి బతికి ఉన్నాడా? లేడా? అని అడిగితే సిస్టర్ సమాధానం లేదు. శవానికి ఆక్సిజన్ ఎలా అందిస్తారు అని అడిగితే సమాధానం లేదు. డాక్టర్ ని అడిగితే ఆయన సమాధానం చెప్పలేకపోతున్నారు. మనిషి చనిపోయిన తర్వాత ఆక్సిజన్ ఎక్కిస్తున్నట్టు ఈ నాటకాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ కన్విన్స్ చేయబోతుండగా వీడియో అయిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు.. డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డబ్బు కోసం ఇంత నాటకం ఆడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విశాఖ జిల్లా గోపాలపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జరిగినట్లు తెలుస్తోంది.