ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పథకానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్. నిజానికి పేద ప్రజలకి ఉచితంగా ఇల్లు కట్టించడం అనేది మంచి కార్యక్రమం. ఈ విషయంలో అధికార పక్షానికి గాని, ప్రతి పక్షానికి గాని రెండో ఆలోచన ఉండదు. అందరూ ఈ కార్యక్రమం సజావుగా సాగాలనే కోరుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఈ మంచి కార్యక్రమానికి ఎందుకు బ్రేక్ పడినట్టు? అసలు హై కోర్టు ఇళ్ల నిర్మాణానికి త్కాలికంగా ఎందుకు బ్రేకులు వేసినట్టు? అసలు కోర్టులో కేసు వేసిన పీటీషన్ దారులు ఎవరు? ఈ విషయంలో తప్పు ఎవరిది? ఈ విషయాలు అన్నిటికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం దిశగా ముందడుగు వేసింది. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన సంగతి తెలసిందే. అయితే పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున పంపిణీ చేశారు. ఇంత తక్కువ భూమిలో సరైన మౌళిక వసతిలో ఇండ్ల నిర్మాణం కష్టతరంగా ఉందని భావించిన 128 మంది లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు 108 పేజీల తుది తీర్పును వెలువరించింది.
ఇండ్ల నిర్మాణానికి సెంటు, సెంటున్నరలో కొత్తగా కాలనీలు ఏర్పాటు చేస్తే అవి మురికివాడలుగా తయారవుతాయని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హైకోర్టు తెలిపింది. అంతే కాక అగ్ని ప్రమాదాలు, మంచినీటి సమస్యలు సంభవించే ప్రమాదముందని పేర్కొంది. ఈ విషయాలను పరిశీలించకుండా ఇళ్లు కట్టుకోవాలని బలవంతం చేయడం సరికాదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. దీనిపై నెలరోజుల్లో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, మరో నెలలోనే నివేదిక తెప్పించుకుని… దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.
మరోవైపు లబ్దిదారులు మాత్రం ఈ పిల్ తాము వేయలేదని.. పిల్ తమ పేరుతో దాఖలైన విషయం తమకు కూడా తెలియదని అంటున్నారు. అయితే.. ఈ విషయంలో అధికార పార్టీ ఇది ప్రతిపక్ష నేతలు చేసిన పని అని.. పేదల ఇండ్ల నిర్మాణం జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో చేసిన పనే అని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి పక్ష నేతలు మాత్రం పేదల ఇండ్ల నిర్మాణం జరిగితే అందరికీ సంతోషమే.. కానీ అంత తక్కువ భూమిలో సరైన మౌళిక సదుపాయాలు లేకండా నిర్మాణం చేపడితే భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వాదిస్తున్నారు. ఇలా కారణాలు ఏవైనా ఏపీలో ఇళ్ల నిర్మాణం ఆగిపోవడం మాత్రం పేద ప్రజలకు షాక్ ఇచ్చింది. అయితే.., ఈ విషయంలో త్రిసభ్య కమిటీ మరో నెల రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. కాబట్టి.., అప్పటి నుండైనా ఇళ్ల నిర్మాణ విషయంలో ఉన్న అన్నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి. మరి.. ఈ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.