ప్రజల ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి. పేద ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారు...
ప్రజల ఆరోగ్య భద్రతపై ఏపీ ప్రభుత్వం రోజుకో గొప్ప నిర్ణయం తీసుకుంటోంది. తండ్రి వైఎస్సార్ బాటలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టారు. తండ్రి ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీని ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేస్తూనే.. కొత్త కొత్త ఆరోగ్య విధానాలను అమల్లోకి తెస్తున్నారు. విలేజ్ క్లీనిక్ ద్వారా గ్రామాల్లోని ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. గ్రామాల్లోని ప్రజలకు వైద్యం మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో..
సీఎం జగన్ మరో కొత్త ఆరోగ్య విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ పేరిట ఓ అద్భుతమైన వైద్య కార్యక్రమం ప్రజలకు చేరువైంది. గురువారం చిలకలూరి పేటలో ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. పేదలు ఆస్పత్రుల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని వైద్య సేవలు ఇంటి ముంగిటే అందుతాయని చెప్పారు. ప్రతీ పేదవాడికి ఫ్యామిలీ డాక్టర్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
పీహెచ్‌సీలో ఉండే ఓ ఇద్దరు వైద్యుల్లో ఒకరు 104 వాహనంలో విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు వెళతారు. అక్కడ గ్రామ ప్రజలకు ఓపీ, గర్భిణులకు వైద్య పరీక్షలు, ఇతర అవసరమైన చికిత్సలు చేస్తారు. తల్లీ బిడ్డల సంరక్షణతో పాటు, అంగణ్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను సందర్శిస్తారు. గ్రామాల్లో అనారోగ్యం కారణంగా మంచానికి పరిమితమైన వారి దగ్గరకు వెళ్లి పరీక్షలు, చికిత్స చేస్తారు. అవసరమైన మందులు ఉచితంగా ఇస్తారు. అంతేకాదు! గ్రామ పారిశుద్ధ్యం విషయంలోనూ డాక్టర్లు దృష్టి పెడతారు. మొబైల్ యూనిట్లలో 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల మందులు ఉంటాయి.
ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్‌లో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. 2023 ఫిబ్రవరి వరకు దాదాపు 54 లక్షల మంది ఈ విధానం ద్వారా ఇంటి వద్దే వైద్య సేవలు పొందారు. అనారోగ్యం ఉందని ఫోన్ చేస్తే చాలు గ్రామ సెక్రటేరియట్‌లోని ఏఎన్‌ఎమ్‌తో పాటు ఇతర వైద్య సిబ్బంది ఇంటి దగ్గరకు వస్తున్నారు. వైద్య పరీక్షలు చేయటంతో పాటు వారికి అవసరమైన ముందులు ఇస్తున్నారు. ఈ విధానంలో పల్లెల్లోని వారికి ఎంతో మేలు జరుగుతోంది.
ఫ్యామిలీ డాక్టర్ విధానం గ్రామాల్లోని పేద ప్రజలకు నిజంగా ఓ వరం. చాలీ చాలని సంపాదనతో అల్లాడిపోయే కుటుంబాలకు చిన్న చిన్న అనారోగ్యాలకు చికిత్స చేయించుకోవటం కూడా ఓ ఇబ్బందే. అలాంటి వారు నేరుగా ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా లబ్ధి పొందవచ్చని ట్రయల్ రన్ ద్వారా స్పష్టం అయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులోకి వస్తే ప్రజలు మరింత లబ్ధిపొందుతారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి, గ్రామ ప్రజలకు వరంగా మారనున్న ఫ్యామిలీ డాక్టర్ విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.