తన ప్రవర్తనతో మరోసారి విమర్శలకు తావిచ్చిన నోవక్‌ జకోవిచ్‌

bat

పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న సామెత మీకు తెలుసు కదా. పేరుకు ఎంత గొప్పవారైనా వారి ప్రవర్తన, నడవడికను బట్టే వారికి పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు లభిస్తుంటాయి. మరి ఈ సెర్బియన్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌ పేరు వినగానే ఏం అంటారు. ఆయనో గొప్ప ఛాంపియన్‌, టెన్నిస్‌లో నెంబర్‌ వన్‌ ర్యాంకు అతనిది. మరి, ఎంత హుందాగా ఉండాలి? ప్రత్యర్థితో ఎంత మర్యాదగా ప్రవర్తించాలి? యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఇలాంటివి ఏమీ జకోవిచ్‌ చూపించలేదు. చాలా అంటే చాలా దురుసుగా నడుచుకున్నాడు. ఇదే మొదటిసారా? అంటే కాదు ఇలాంటివి చాలానే ఉన్నాయి అంటున్నారు విమర్శకులు.

జకోవిచ్‌ ప్రవర్తన చూసి అభిమానులు కూడా చీవాట్లు పెట్టిన సందర్భాలు లేకపోలేదు. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ 6-4, 6-4, 6-4 తేడాతో రష్యా ప్లేయర్‌ డానియల్‌ మెద్వెదెవ్‌ చేతిలో ఓడిపోయాడు. వరుస సెట్లలో ఓడిపోతుండటంతో జకోవిచ్‌ కోపం తారస్థాయికి చేరింది. ఒకానొక సమయంలో ఆ కోపాన్ని బాల్‌ గార్స్‌పై చూపబోయాడు. రాకెట్‌ విసిరేస్తాడేమో అని అందరూ షాక్‌కు గురయ్యారు. ఓటమి కోపంతో రాకెట్‌ను నేలకేసి కొట్టి విరగొట్టేశాడు. ప్లేయర్లు ఇలాంటి ప్రవర్తనను చూపిస్తూనే ఉంటారు. కానీ, జకోవిచ్‌ విషయం వేరు. అతను ఇలాంటి పనులతో ఎన్నోసార్లు అభిమానుల కంటే హేటర్స్‌నే ఎక్కువ పెంచుకున్నాడు.

మొన్న టోక్యో ఒలింపిక్స్‌లోనూ అదే తరహా పని చేశాడు జకోవిచ్‌. కాంస్య పతక పోరులో పాయింట్‌ కోల్పోయిన కోపంలో టెన్నిస్‌ రాకెట్‌ను స్టాండ్స్‌లోకి విసేరశాడు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా జకోవిచ్‌ చేసిన పనిని చాలామంది తప్పుబట్టారు. ప్రపంచ నంబర్‌ వన్‌గా ఉన్న జకోవిచ్‌ ఇలాంటి ప్రవర్తనతో తన హుందాతనాన్ని కోల్పోతున్నాడు. విమర్శకులు, అభిమానులు ఎవరూ ఇలాంటి పనులను హర్షించరని హితవు పలుకుతున్నారు.