ఫ్రెంచ్ ఓపెన్‌లో ఊహించని పరిణామం. . టైటిల్ ఫేవరెట్, ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి నవోమి ఒసాకా టోర్నీ నుంచి తప్పుకొంది. టోర్నీకి ముందు మీడియాను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన ఈ జపాన్ స్టార్ ఇప్పుడు ఏకంగా ఈవెంట్‌కే దూరమై అందరినీ షాక్‌కు గురిచేసింది. కొన్నాళ్లుగా మానసికంగా ఆందోళనకు గురవుతున్నానని, కొద్దిరోజులు ఆటకు విరామం ఇవ్వాలనుకుంటున్నందున టోర్నీలో ఆడాలనుకోవడం లేదని సోషల్ మీడియాలో ప్రకటించింది. సింగిల్స్ తొలిరౌండ్ గెలిచిన 23 ఏళ్ల ఒసాక రెండోరౌండ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టోర్నీకి దూరమవడంపై ఆమె ట్విటర్‌లో సుదీర్ఘ లేఖ రాసింది. వైదొలగాలని ముందే ప్రకటించడం టోర్నీతో పాటు మిగతా క్రీడాకారులకు మంచిదని భావిస్తున్నాని. మీడియా సమావేశాల్లో పాల్గొనడం వల్ల తాను మానసికంగా ఆందోళనకు గురవుతున్నట్లు పేర్కొన్నది. అందుకే ఇకపై మీడియా సమావేశాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేసింది.
తాను ముందే చెప్పినట్లుగానే తొలి రౌండ్ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా మీట్‌కు డుమ్మా కొట్టింది. ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో ఒసాకాకు రిఫరీ 15 వేల డాలర్ల జరిమానా విధించారు. నయోమీ ఒసాకా కనుక ఇకపై మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని భావిస్తే మరిన్ని కఠినమైన జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆమెపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని ప్రకటించారు. నయోమీ ఒసాక 2018లో యూఎస్ ఓపెన్ గెలిచి తొలి సారిగా గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నది. అప్పటి నుంచి నయోమీ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నట్లు చెబుతున్నది. ఆ తర్వాత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, గత ఏడాది చివర్లో యూఎస్ ఓపెన్, ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచి నాలుగు గ్రాండ్స్ స్లామ్స్ తన ఖాతాలో వేసుకున్నది.