రిషి, షెల్లీ, రవి కాలే, దేవయాని శర్మ తదితరులు నటించిన బోల్డ్ వెబ్ సిరీస్ సైతాన్. డిస్నీ+హాట్ స్టార్ లో జూన్ 15 నుంచి స్ట్రీమ్ అవుతోంది. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ట్రైలర్ నిండా బూతులు, బ్రూటల్ కిల్లింగ్స్ ఇవే ఉన్నాయి. మరి కథలో ఏమైనా దమ్ము ఉందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
ఈ మధ్య కాలంలో బూతులు, బోల్డ్ సన్నివేశాలు, హత్యలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు బాగా ఆడుతున్నాయి. కంటెంట్ లో అశ్లీలత, అసభ్యకర సన్నివేశాలు ఉన్నా కూడా చూసేస్తున్నారు. అయితే అడల్ట్ కంటెంట్ తో కూడిన వెబ్ సిరీస్ లే ఇటీవల కాలంలో బాగా హిట్ అవుతున్నాయి. ఈ కోవకి చెందినదే సైతాన్ వెబ్ సిరీస్. పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర వంటి క్లీన్ సినిమాలను తెరకెక్కించిన మహి వి. రాఘవ్ ఇలాంటి వెబ్ సిరీస్ ని తీస్తారని ఎవరూ ఊహించలేదు. క్రియేటర్ మరియు నిర్మాతగా ఈయన చేసిన క్లీన్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ తర్వాత రూటు మార్చి దర్శకుడిగా ‘సైతాన్’ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. డిస్నీ+హాట్ స్టార్ లో జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
సావిత్రికి (షెల్లీ నబు కుమార్) బాలి (రిషి), జయప్రద (దేవయాని శర్మ), గుమ్తి (జాఫర్ సాదిక్) అనే ముగ్గురు పిల్లలు ఉంటారు. భర్త వదిలేసి వెళ్లిపోవడంతో పిల్లల కోసం ఓ పోలీస్ తో ఇల్లీగల్ రిలేషన్ లో ఉంటుంది. అయితే తల్లి గురించి ఇరుగు పొరుగు వారు తప్పుగా మాట్లాడుతుంటే బాలికి అవమానంగా అనిపిస్తుంది. తన తల్లి కోసం వచ్చిన పోలీస్ అధికారి చెల్లెలిని తప్పుగా చూడడంతో పోలీస్ తలను నరుకుతాడు బాలి. దీంతో జైలుకు వెళ్తాడు. కొన్నాళ్ళకు తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత దళంలో చేరతాడు. హోమ్ మినిస్టర్ నుదిటి మీద గన్ పెట్టి బెదిరించే స్థాయికి ఎదుగుతాడు. ఈ స్థాయికి ఎలా ఎదిగాడు? కళావతి (కామాక్షి భాస్కర్ల), పోలీస్ అధికారి నాగిరెడ్డి (రవి కాలే) బాలి ప్రయాణాన్ని ఎలాంటి కీలక మలుపు తిప్పారు అనేది తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.
‘సమాజాం నన్ను నేరస్తుడు అన్నది, కానీ నేనొక బాధితుడిని’ అనే డైలాగ్ తో దర్శకుడు కథేంటో చెప్పేశారు. బాధ ఉంటే తప్ప నేరం చేయరు, నేరం చేసిన వాళ్ళు నేరస్తులు కాదు, బాధితులు అనే ఉద్దేశంతో దర్శకుడు ఈ కథని తెరకెక్కించారు. అయితే కత్తి పట్టుకున్నోడు చివరికి ఆ కత్తితోనే అంతమవుతాడు అన్నట్టు బాలి అధ్యాయం కూడా ముగిసిపోతుంది. సైతాన్ కథ నిజంగా సైతాన్ లానే ఉంటుంది. హింస, శృంగారం, బూతులు మాత్రమే కాదు అంతకు మించి ఉంటుంది. బాలి, అతని కుటుంబ సభ్యులు కలిసి హత్యలు చేస్తుంటే అలా చేయడంలో తప్పు లేదు అనేంతగా ప్రేక్షకులను కన్విన్స్ చేసేలా సిరీస్ ని తెరకెక్కించారు దర్శకుడు మహి వి రాఘవ్.
తలలు తెగిపడిన దృశ్యాలు, మహిళలను బలాత్కారం చేసే సన్నివేశాలు, బూతు మాటలు ఎక్కువగా ఉంటాయి. అన్ని వర్గాల వారికి ఈ సిరీస్ నచ్చకపోవచ్చు. బోల్డ్ సీన్లు, ఘాటు సన్నివేశాలే కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. భర్త చనిపోయిన మహిళ వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే ఆమెను ఒక తిట్టుతో ముద్ర వేసే సమాజం మగాడి మీద ఎందుకు వేయదు అని అడిగే ప్రశ్న ఆకట్టుకుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక వ్యక్తి నేరస్తుడు అవుతాడు కానీ అతనూ ఒక బాధితుడే అని, ఆ వ్యక్తిని బాధితుడిగానే చూడాలని చెప్పే కాన్సెప్ట్ సిరీస్ లోనే బాగుంటుంది. నిజ జీవితంలో వర్కవుట్ అవ్వదు.
ఇది అందరూ యాక్సెప్ట్ చేసే వెబ్ సిరీస్ కాదు. కేవలం ఒక వర్గం మాత్రమే ఆదరించే సిరీస్. అనుకోని పరిస్థితుల్లో నేరస్తుడు అయ్యి జైలుకు వెళ్లడం, ఆ తర్వాత బయటకొచ్చి నేరస్తులతో కలిసి పని చేసే కాన్సెప్ట్ లతో చాలా కథలు వచ్చాయి. ఈ సిరీస్ కూడా అలానే ఉంటుంది. కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. కాస్త రొటీన్ గా ఉంటుంది. మరీ కొత్తగా ఏమీ ఉండదు. అయితే తెలుగులో ఇలా బూతులు, హింస, అశ్లీలత, క్రూరత్వంతో నిండిన వెబ్ సిరీస్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. అందులోనూ బాగా రా అండ్ రస్టిక్ గా రావడం అయితే ఇదే తొలిసారి.
బాలి పాత్రలో రిషి చాలా బాగా నటించారు. క్రోధం, ఆవేశం, దుఃఖం వంటి భావోద్వేగాలను చక్కగా పండించారు. ఇక దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, కామాక్షి భాస్కర్ల, షెల్లీ, రవి కాలే వంటి నటులు చాలా బాగా నటించారు. ఈ పాత్రల్లో వీరు తప్ప వేరే వాళ్ళు నటించలేరేమో అన్న భావన కలిగించారు. కామాక్షి భాస్కర్ల, షెల్లీ, రవి కాలే పాత్రలైతే ఛాలెంజింగ్ అని చెప్పాలి. అంత బాగా నటించారు. లీనా, నితిన్ ప్రసన్న, మణికందన్, రవి కుమార్, అనీషా దామ, సంజయ్ కృష్ణ తదితరులు బాగా నటించారు.
షణ్ముగ సుందరం కెమెరా పనితనం చాలా బాగుంది. శ్రీరామ్ మద్దూరి మ్యూజిక్, శ్రావణ్ కటికనేని ఎడిటింగ్ సిరీస్ కి బాగా హెల్ప్ అయ్యాయి. మాటలు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. బోల్డ్ కంటెంట్ అయినా గానీ దర్శకుడు చెప్పాలనుకున్న దాన్ని, తనలో ఉన్న సంఘర్షణను ఈ సిరీస్ ద్వారా బయట పెట్టిన తీరు మెప్పిస్తుంది.
చివరి మాట: సైతాన్ ని చూసే వారు నేరస్తులు కాదు, బాధితులు అంతకంటే కాదు. ఇలాంటి కంటెంట్ ని యాక్సెప్ట్ చేసేవారు హ్యాపీగా చూసుకోవచ్చు.
రేటింగ్: 2.5/5