టాలీవుడ్ లో హిట్స్, ప్లాప్స్ లెక్కచేయకుండా సినిమాలు చేస్తున్న హీరోలలో సందీప్ కిషన్ ఒకరు. మొదటి నుండి హార్డ్ వర్క్ నమ్ముకొని కష్టపడుతున్నాడు.. కానీ, ఇప్పటిదాకా రావాల్సిన గుర్తింపు, సరైన బ్రేక్ రాలేదు. వాటికోసమే డిఫరెంట్ స్టోరీస్ ని ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈసారి యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ‘మైఖేల్’ మూవీతో వచ్చాడు. దర్శకుడు రంజిత్ జైకోడి తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి, అనసూయ లాంటి స్టార్ కాస్ట్ తో పాటు ట్రైలర్ కూడా అదిరిపోయేసరికి సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి తాజాగా మంచి బజ్ తో రిలీజ్ అయిన మైఖేల్ మూవీ ఎలా ఉంది? సందీప్ కి హిట్ ఇచ్చిందా లేదా? రివ్యూలో చూద్దాం!
ఈ సినిమా కథ ముంబైలోని బడా గ్యాంగ్ స్టర్ గురునాథ్(గౌతమ్ మీనన్), మైఖేల్(సందీప్ కిషన్) క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన మైఖేల్.. ఆమెను చంపిన వాడిపై పగ తీర్చుకోవాలని గ్యాంగ్ స్టర్ గురునాథ్ వద్ద పనిలో చేరతాడు. ఓ క్రైమ్ లో భాగంగా ఢిల్లీ వెళ్లిన మైఖేల్ కి తీరా(దివ్యాంశ) పరిచయం అవుతుంది. ఒకరినొకరు ఇష్టపడే టైంలో ఇద్దరికీ సంబంధించి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అప్పటినుండి మైఖేల్ లైఫ్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. కట్ చేస్తే.. మైఖేల్ కి తన తల్లిని చంపింది ఎవరో తెలుస్తుంది. అదే టైంలో ఎవరు లేరనుకున్న మైఖేల్ లైఫ్ లో.. ఓ స్పెషల్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. మరి మైఖేల్ తల్లిని చంపింది ఎవరు? తన తల్లిని చంపినవాడిపై మైఖేల్ ఎలా పగ తీర్చుకున్నాడు? మైఖేల్ లైఫ్ లో ఆ స్పెషల్ క్యారెక్టర్ ఎవరు? మైఖేల్ లైఫ్ లో గురునాథ్ పాత్ర ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
తెలుగులో రెగ్యులర్ కథలను కాకుండా డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేసే హీరోలలో సందీప్ కిషన్ ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే.. తన కెరీర్ బిగినింగ్ నుండి హిట్స్, ప్లాప్స్ పట్టించుకోకుండా హానెస్ట్ గా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. కానీ.. లైఫ్ లో కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు కదా.. సందీప్ లైఫ్ లో అదొక్కటే తక్కువని చెప్పాలి. తెనాలి రామకృష్ణ, ఏ1 ఎక్స్ ప్రెస్, వివాహ భోజనంబు, గల్లీరౌడీ లాంటి ప్లాప్స్ తర్వాత మైఖేల్ మూవీతో మంచి బజ్ క్రియేట్ చేయగలిగాడు సందీప్. గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే పూర్తిగా సీరియస్ యాక్షన్ పై ఫోకస్ పెట్టినట్లు అర్థమైంది. సందీప్ లుక్, విజయ్ సేతుపతి ప్రెసెన్స్, గౌతమ్ మీనన్ నేరేషన్ కొత్తగా అనిపించాయి.
ఇక సినిమా విషయానికి వస్తే.. రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ మూవీస్ మొదలైనట్లుగానే గురునాథ్ అసిస్టెంట్ స్వామి అనే ఓ క్యారెక్టర్.. సినిమాలోని అన్నీ క్యారెక్టర్స్ ని ఎలివేషన్స్ తో నేరెట్ చేస్తూ.. స్టార్ట్ అయ్యింది. ముందుగా ముంబైలోని బడా గ్యాంగ్ స్టర్ గురునాథ్ పాత్రలో గౌతమ్ మీనన్ ని పరిచయం చేస్తూ.. ఆ తర్వాత మైఖేల్(సందీప్) ఇంట్రడక్షన్.. మైఖేల్ గురునాథ్ దగ్గర పనిలో చేరడం.. అక్కడినుండి మిగతా క్యారెక్టర్స్ ని ఎంటర్ చేస్తూ కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఆ తర్వాత మైఖేల్ లైఫ్ లోకి తీరా క్యారెక్టర్ లో దివ్యాంశ కౌశిక్ ఎంట్రీ.. ఇద్దరి మధ్య సీరియస్ లవ్ ట్రాక్.. మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఫస్టాఫ్ సాగించారు.
ఫస్టాఫ్ లో మైఖేల్ తో పాటు అన్నీ క్యారెక్టర్స్ కి టార్గెట్స్ ని సెట్ చేసిన డైరెక్టర్.. అసలు హీరోయిన్ క్యారెక్టర్ కి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. పైగా 90స్ మిడ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ తీశాడు.. కాబట్టి, అందుకు అనుగుణంగా ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్ సెట్ అయినా.. స్లో నేరేషన్, ఎయిమ్ లెస్ హీరోయిన్ క్యారెక్టర్ తో కథను వేగంగా తీసుకెళ్లలేకపోయాడు. ముందునుండి స్లోగా సాగిన స్క్రీన్ ప్లేలో.. ఇంటర్వెల్ బ్లాక్ కోసం ఓ ట్విస్టు ప్లాన్ చేశారు. ఇక సెకండాఫ్ నుండి అసలు కథ మొదలవుతుంది. కానీ.. ఊ అంటే హీరోకి ఫైట్స్.. యాక్షన్ సీక్వెన్స్, వయిలెన్స్ ఎక్కువగా పెట్టేశారు. దర్శకుడు కథాకథనాల కంటే ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ లపై ఫోకస్ పెట్టడం మేజర్ మైనస్.
సెకండాఫ్ కూడా స్లోగా స్టార్ట్ అయ్యింది.. కానీ, అప్పుడే విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్స్ ఎంట్రీతో ప్రేక్షకులకు కాస్త ఊపు వస్తుంది. అక్కడినుండి సినిమాలో వేగం పెరిగి.. క్లైమాక్స్ వరకూ స్పీడ్ కంటిన్యూ అవుతుంది. బట్.. ఇందులో కూడా సాగదీసిన సన్నివేశాలు ఉన్నాయి. అయితే.. విజయ్ సేతుపతి క్యారెక్టర్ కాసేపే అయినా ఎలివేషన్స్, క్యారెక్టరైజేషన్ బాగున్నాయి. వరలక్ష్మి క్యారెక్టర్ కి స్కోప్ లేదు. ఇక క్లైమాక్స్ లో జరగబోయేది ఆడియన్స్ ముందే ప్రిడక్ట్ చేయగలుగుతారు. కేవలం స్క్రీన్ ప్లే స్లోగా ఉండి.. సాగదీసిన సీన్స్, బలం లేని సిట్యుయేషన్స్ వలన క్లైమాక్స్ రొటీన్ గా ముగిసింది. బట్.. మైఖేల్ క్యారెక్టర్ కి, తల్లికి మధ్య ఫ్లాష్ బ్యాక్ బాగుంది.
ఓరల్ గా సెకండాఫ్ లో కథకు అవసరమైన పాయింట్స్ పడ్డాయని చెప్పవచ్చు. అయితే.. గ్యాంగ్ స్టర్ సినిమాలలో ఏ చిన్న లాజిక్ మిస్ అయినా ఫలితం తారుమారయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్రైలర్ ని ఎంత బాగా కట్ చేసినా.. థియేటర్ లో ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టకూడదు. ఈ సినిమా డ్యూరేషన్ విషయంలో మేకర్స్ ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. ఇక సినిమా చివరలో మైఖేల్ కి కొనసాగింపు ఉంటుందని ఓ కొత్త ట్విస్టుతో ఎండ్ చేశారు. నటినటుల విషయానికి వస్తే.. మైఖేల్ క్యారెక్టర్ లో సందీప్ ఒదిగిపోయాడు. ప్రతి సీన్ లో అతని హార్డ్ వర్క్ కనిపిస్తుంది. కానీ.. క్యారెక్టర్ లో కథకు అవసరమైన దానికంటే ఎక్కువ సీరియస్ ని పెట్టేశారు.
ఇక గ్యాంగ్ స్టర్ గా గౌతమ్ మీనన్.. మిగతా క్యారెక్టర్స్ లో విజయ్ సేతుపతి, అయ్యప్ప శర్మ మెప్పించారు. హీరోయిన్ దివ్యాంశకి పెద్దగా స్కోప్ లేదు. కానీ.. ఇందులో స్పెషల్ గా మెన్షన్ చేసి.. అభినందించాల్సిన క్యారెక్టర్ వరుణ్ సందేశ్ చేశాడు. ఓ కొత్త వరుణ్ ని చూపించే ప్రయత్నం చేశాడు. మిగతా క్యారెక్టర్స్ పరవాలేదు. అయితే.. ఇందులో మెచ్చుకోవాల్సిన విషయాలు సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ. ఇవి రెండు సినిమాకి ప్రధాన బలాలు. భరత్ చౌదరి, పుస్కుర్ రామ్మోహన్ రావు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫైనల్లీ.. మైఖేల్ కథ చాలా సినిమాల రిఫరెన్స్ లతో ఇప్పుడే మొదలైంది. డైరెక్టర్ రంజిత్ టేకింగ్, మేకింగ్ చాలా స్టయిలిష్ గా ఉన్నాయి. డైలాగ్స్ అక్కడక్కడా కుదిరాయి.
చివరిమాట: మైఖేల్.. పడుతూ లేస్తూ నెట్టుకొచ్చాడు!
రేటింగ్: 2/5