సీఎం కేసీఆర్ పై రాములమ్మ ఫైర్

హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి ఫైర్ అయ్యారు. కేసీఆర్ పై రాజకీయ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని విజయశాంతి మండిపడ్డారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు వసూలు చేస్తున్న ఫీజులపై ప్రభుత్వానికి ఏ మాత్రం నియంత్రణ లేదని ఆమె అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో పీజులు కట్టలేక జనం అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించలేదా అని రాములమ్మ ప్రశ్నించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పధకం ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో 5లక్షల రూపాయల వరకు కేంద్రమే చెల్లించేదని ఆమె అన్నారు. ఆయుష్మాన్ భారత్ పధకంలో చేరనందుకు తెలంగాణ రాష్ట్రం 200 కోట్ల రూపాయలు కోల్పోయిందని విజయశాంతి మండిపడ్డారు.

Vijayashanti

తన బంధువులు, అనుచరులకు సంబందించిన ప్రైవేట్ ఆస్పత్రులు ప్రతి రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడుకునేందుకే సీఎం కేసీఆర్ ఆయుష్మాన్ భారత్‌ను, ఆరోగ్యశ్రీని అమలు చేయడం లేదని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్‌ను అమలు చేయనందుకు నిరసనగా, కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలన్న డిమాండ్‌ తో బుధవారం జరగబోయే గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష ను విజయవంతం చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు. ఈ దీక్ష తరువాతనైనా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ పధకం ఆయుస్మాన్ భారత్ ను తెలంగాణలో ప్రవేశపెడతారేమో చూడాలని ఆమె అన్నారు.