తెలంగాణ సర్కార్ కొత్త ప్రతిపాదన తీసుకురావడానికి సంసిద్దం అవుతుంది.. ఏంటా ప్రతిపాదన అంటారా? మటన్ షాపులతో పాటు, ఫిష్ మార్కెట్ నిర్వహణ కూడా తానే తీసుకోవాలానే సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో మాంసం ధరలను నియంత్రించేందుకు, అందరికీ పరిశుభ్రమైన మాంసాన్ని అందించేందుకు రాష్ట్ర పశువర్థక శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నది.
తొలి నుంచి కూడా మాంసం విక్రయాలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఉంటున్నాయి. దీంతో, పలు చోట్ల నాసిరకం మాంసాన్ని వ్యాపారులు అమ్ముతున్నారు. చనిపోయిన జంతువులను కోసి కూడా విక్రయిస్తున్నారు. దీనికి తోడు ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముతూ పేదవారు మటన్ తినలేని పరిస్థితిని తీసుకొచ్చారు. అందుకోసమే ఈ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో కబేళాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు చొప్పున, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి జోన్‌లో ఒకటి చొప్పున వధశాలలను ఏర్పాటు చేసివాటిని స్థానిక మాంసం దుకాణాలతో లింక్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
ఇకపై ప్రభుత్వం సరఫరా చేసే మాంసాన్నే షాపుల్లో అమ్మాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరపాల్సి ఉంటుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మటన్ మార్టులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 10వేల షాపులుండగా, అందులో 2వేల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంది. మిగతా వాటిని కూడా ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తోంది. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో ప్రజలకు ఎంత వరకు మేలు జరుగుతుందో చూడాలి.