తెలంగాణలో మరో మహమ్మారి విజృంభణ! వణికిస్తున్న బ్లాక్ ఫంగస్ !

ప్రపంచ దేశాలని కరోనా వణికిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో దీని ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికీ సెకండ్ వేవ్ లో రోజుకి లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇందుకు అతీతం కాదు. అయితే కరోనాతో వణికిపోతున్న తెలంగాణలో ఇప్పుడు మరో మహమ్మారి బయట పడింది. అదే బ్లాక్ ఫంగస్. దీనికే మ్యూకర్ మైకోసిస్ అని పేరు. కరోనా నుంచి కోలుకున్నఅతికొద్ది మందిలో ఇప్పుడు ఈ లక్షణాలు బయటపడుతున్నాయి. నిర్మల్ జిల్లా భైంసాలోని గణేష్‌నగర్‌కు చెందిన తోట లింగురామ్ అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో మరణించాడు. అతడికి ఇటీవలే కరోనా కూడా సోకింది. చికిత్స అనంతరం కోవిడ్ నుంచి కోలుకున్నాడు. తర్వాత బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. ముక్కు, కళ్ల నుంచి ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాపించిందని ఈక్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశాడు.ఇక గాంధీ ఆస్పత్రిలో మరో ముగ్గురు కరోనా రోగుల్లోనూ దీనిని గుర్తించారు. వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా, ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు డాక్టర్స్ తెలియ చేశారు. ఇక నిర్మల్ జిల్లాకే చెందిన మరో ఐదుగురు బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇందులో కుబీర్ మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో బ్లాక్ ఫంగస్ కేసులు వస్తున్నాయి. 2వేల మందికి పైగా బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. మహారాష్ట్రకు పక్కనే నిర్మల్ జిల్లా ఉండడంతో తెలంగాణలో కూడా ఈ కేసులు నమోద అవుతున్నట్టు తెలుస్తోంది. సంబంధిత వైద్య వర్గాలు మాత్రం ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ వ్యాప్తిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకపోతే.., కరోనా నుండి కోలుకున్న వారందరికీ ఈ బ్లాక్ ఫంగస్ రాదు. వీరిలో అతి తక్కువ సంఖ్యలో మాత్రమే ఈ కేసులు నమోదు అవుతున్నాయి.