నిలువునా మాడుతున్న వేప చెట్లు.. కారణమిదే అంటున్న శాస్త్రవేత్తలు

Neem Tree Issue

హైదరాబాద్‌- వేప చెట్టు.. రుచి చేదేమో.. కానీ దానిలోని ఔషధగుణాలు ఈ ప్రపంచంలో మరే వృక్షంలోనూ ఉండవేమో. మనకు వచ్చే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి.. పంటల తెగుళ్లు వరకు ప్రతి సమస్యకు వేప నివారణ ఔషధంగా పని చేస్తోంది. అలాంటి వేప చెట్టుకు.. తీరని కష్టం వచ్చింది. ఎక్కడ చూసినా.. ఎండిపోయి.. నిట్ట నిలువుగా మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. వ్యవసాయ విశ్వవిద్యాలయం రంగంలోకి దిగింది.

ఈ నేపథ్యంలో వర్సిటీ పరిశోధన విభాగం బృందం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేపకొమ్మలను సేకరించి.. పరిశీలించింది. తెగులు సోకిన భాగాలను ల్యాబ్‌ లో పరీక్షించి.. సమస్యకు కారణాలను గుర్తించింది. ఓ కీటకం, మూడు శిలీంద్రాల కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు బృందం తెలిపింది. వేపకొమ్మల చివరి భాగంలో టిమస్కిటో బగ్‌ అన్న కీటకం కొరికి రసాన్ని పీల్చడంతో.. ఈ సమస్య మొదలైందని పరిశోధకులు గుర్తించారు. ఈ కీటకాలు ముందునుంచే ఉన్నా.. దానికి తోడుగా కొన్ని రకాల శిలీంద్రాలు వ్యాపించడంతో.. సమస్య ముదిరిందని తేల్చారు.

Neem Tree Issue

వేపచెట్లను టిమస్కిటో బగ్‌ కొరికేసి రసం పీల్చడంతో ఆ ప్రాంతంలోని చిగుళ్లు ఎండిపోవటం మొదలవుతోంది. అదేచోట కొన్నిరకాల శిలీంద్రాలు పాగా వేసి.. మెల్లగా విస్తరిస్తూ చెట్టు నిలువునా మాడిపోయేలా చేస్తున్నాయి. ఇందులో ‘ఫోమోప్సిస్‌ అజాడిరెక్టే’ అన్న శిలీంద్రం తీవ్ర విధ్వంసానికి కారణమవుతోందని గుర్తించారు. వ్యవసాయ వర్సిటీ పరిశోధన బృందం చేసిన కల్చర్‌ టెస్టుల్లో మూడొంతులకుపైగా ఈ శిలీంద్రమే కనిపించింది. ఆ తర్వాత ఫ్యుజేరియం, కర్వులేరియా అనే ఫంగస్‌లు ప్రభావం చూపుతున్నట్టు తేలింది. ఇవి కాకుండా మరో ఏడెనిమిది రకాల ఫంగస్‌లు కనిపించినా.. అవి నామమాత్రంగానే ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. వేప చెట్ల కొమ్మలపై కనిపిస్తున్న జిగురు మచ్చలు ఈ ఫంగస్‌ల వల్ల ఏర్పడినవేనని తెలిపారు.

సమస్య పరిష్కారానికి వాడాల్సిన కీటకనాశనులివీ..
కీటకాలను నిర్మూలించేందుకు.. ప్రతి లీటర్‌ నీటిలో థయోమెథాక్సమ్‌ 0.2 గ్రాములు, అసిటామిప్రిడ్‌ 0.2 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.

శిలీంద్రాల తెగులును నాశనం చేసేందుకు కార్బండాజిమ్, మ్యాంకోజెబ్‌ల మిశ్రమాన్ని ప్రతి లీటర్‌కు 2.5 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.

ఆ వేపపుల్లలతో ఎలాంటి ప్రమాదం లేదు
శిలీంద్రాలు ఆశించిన వేప చెట్లు ఎండిపోతున్న నేపథ్యంలో.. చాలాచోట్ల వేపపుల్లలతో పళ్లు తోముకునేందుకు జనం భయపడుతున్నారు. ఇదేదో వింత వ్యాధి అని.. ఇలాంటి వేప పుల్లతో పల్లు తొమితే.. వేరే సమస్యలు తలెత్తుతాయిన ఆందోళన వ్యక్యం చేస్తున్నారు. అయితే వాటి నుంచి మనుషుల ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదని, మాడినంత మేర తొలగించి మిగతా పుల్లలతో పళ్లు తోముకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

జామ, కానుగ చెట్లపైనా ప్రభావం
ఈ శిలీంద్రాలు వేపకే పరిమితం కాకుండా కొన్ని ఇతర రకాల చెట్లపైనా కనిపిస్తున్నట్టు నిపుణులు తాజాగా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో జామకాయలపై పెద్దపెద్ద మచ్చలు ఏర్పడుతున్నాయన్న ఫిర్యాదులు వచ్చాయని.. వాటిని పరిశీలించగా ఈ శిలీంద్రాల ప్రభావమేనని తేలిందని అనురాగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. మరోవైపు కానుగ చెట్లకు కూడా ఈ సమస్య వస్తోందని ఏజీ వర్సిటీ నిపుణులు చెప్తున్నారు.